Share News

ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం

ABN , Publish Date - Aug 17 , 2026 | 10:35 AM

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం
AP Legislative Council

అమరావతి, ఆగస్టు 17: ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలను మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు.


పెద్దల సభలో ఇలా చేయడం సరికాదు: నాదెండ్ల

వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఇలా చేయటం సరికాదన్నారు. సభా గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. వైసీపీ వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.


వైసీపీపై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే బొత్సకు మైక్ ఇవ్వటంపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఐదేళ్లు కనీసం డీఎస్సీ ఇవ్వలేదని, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స.. గొడ్డలి పార్టీ నేతకు కనీసం ఈ విషయం చెప్పలేకపోయారన్నారు. తాము వచ్చాక డీఎస్సీ వేస్తే గొడ్డలి పార్టీ నేతలు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. కోర్టులో వందలాది కేసులు వేశారన్నారు. డీఎస్సీపై నాలుగు రోజుల పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఐదేళ్లు మోసం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అయ్యాక ఏడాది తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ సభ్యుల నినాదాలతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 10:56 AM