Share News

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం

ABN , Publish Date - Aug 17 , 2026 | 09:57 AM

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం
AP Assembly Session

అమరావతి, ఆగస్టు 17: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు(సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా, 103 పనులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డుల ద్వారా రూ.41,187.7 కోట్లను టూ అప్ చేశామని.. ఇందులో రూ.12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే, ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకూ 30173 మంది రైతులకు 71,293 ప్లాట్‌లు ఇచ్చామన్నారు. కౌలు కింద రూ. 2248.03 కోట్ల మేరకు రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఏపీ రాజధాని అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని... ప్రభుత్వ భవనాలు టైం షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. వెంకటపాలెంలో నాలుగువైపులా రోడ్లు ఉన్నా కనెక్టివిటీ లేదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వం చూడాలని తెలిపారు. పెదపరిమి నుంచి తుళ్లూరుకు వెళ్లాలంటే సరైన రోడ్డు లేదని, మందడం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుకు రాలేకపోతున్నామని చెప్పారు. 29 గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉందని.. అయితే నత్తనడకన జరుగుతోందని తెలిపారు. ఈ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారిని కేటాయించి మానిటర్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.


ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. 29 గ్రామాల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు. పది సంవత్సరాల కౌలు గడువు పూర్తయ్యిందని, రైతులకు ఎలాంటి సహాయం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పెరిగిన కాస్ట్ ఎంత అని ఎమ్మెల్యే అడిగారు.


దీనికి మంత్రి నారాయణ సమాధానమిస్తూ.. 29 గ్రామల్లో ట్రంక్ రోడ్లు, లే అవుట్లు వేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.904 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని, కొన్ని సాంకతిక సమస్యల వల్ల మరలా టెండర్లు పిలవాల్సి వచ్చిందని అన్నారు. 29 గ్రామాల్లో కూడా ఈనెల 27న టెండర్ అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల కారణంగా అక్కడ అభివృద్ధి జరగలేదని, అందుకే వారికి మరో 10 సంవత్సారాల మేర కౌలు గడువు పొడిగించామని తెలిపారు. ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్న వారికి 10 ఏళ్లు కౌలు ఇస్తామని అన్నారు. 2014-19కి.. నేటికి అమరావతిలో ఖర్చు 25 శాతం పెరిగిందన్నారు. మంగళగిరి రోడ్డుకు కలిసే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయ్యిందని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చినందున కరకట్ట రోడ్డును రేపటి నుంచి ఆపేస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

రాజమండ్రి గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 10:06 AM