CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:21 PM
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా అన్ని నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని, లేకపోతే వెంటపడతామని హెచ్చరించారు.
అమరావతి, జనవరి 12: అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు (సెక్రటరీలు), విభాగాధిపతులతో జరిగిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై మండిపడ్డారు. ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. ఈనెల (జనవరి) 15వ తేదీ డెడ్‌లైన్‌గా ఇచ్చినా ఎందుకు ఖర్చు చేయడం లేదని సీఎం నిలదీశారు.
సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో నిధులు ఎక్కువగా మిగిలిపోయాయని ముఖ్యమంత్రి ఆగ్రహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో సుమారు రూ.320 కోట్లు ఉంటే కేవలం రూ.120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని, లేకపోతే వెంటపడతామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో పెట్టి, మార్చి 15 నాటికి అంతా ముగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే ఇలా చేస్తారా? అని నిలదీశారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా? అని ప్రశ్నించారు. అన్ని శాఖలతో పోల్చితే ఫైనాన్స్ శాఖ మాత్రం బాగా పనిచేస్తోందని ప్రశంసించిన సీఎం... వారే ఇతర శాఖల వెంటపడుతున్నారని తెలిపారు. ఈనెలాఖరులోగా కేంద్ర పథకాల డబ్బులు ఖర్చు చేసి, మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి డబ్బులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
తిరుపతిలో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..
బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు
Read Latest AP News And Telugu News