CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:14 PM
బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంసించారు.
అమరావతి, జనవరి12: సత్యసాయి జిల్లాలో బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో భారత్ మరోసారి ప్రపంచ స్థాయిలో తన సామర్థ్యాన్ని చాటింది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆధ్వర్యంలో జరిగిన ఈ పనుల్లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వర్చువల్‌గా పాల్గొని అందరినీ అభినందించారు. జీఎస్‌డీపీ సమీక్షా సమావేశం నుంచే సీఎం, మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించటంపై అందరినీ అభినందించారు. అలాగే మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లందరితో కలిసి ఈ ఉమ్మడి విజయంలో వర్చువల్‌గా పాల్గొంటున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమే అని చెప్పుకొచ్చారు. రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందించారాయన. అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని సీఎం ప్రశంసించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో.. ప్రపంచ స్థాయిలో ఈ రికార్డును సాధించడం గర్వకారణమన్నారు చంద్రబాబు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారని తెలిపారు. జనవరి 6 నుంచి 11 వరకు నిరంతరాయంగా 52 కిలోమీటర్ల 6 లేన్ రహదారి, 84.4 కిలోమీటర్ల 4 లేన్ రహదారి నిర్మాణం జరిగింది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను 10 వేల కిలోమీటర్ల మేర వేగంగా చేపడుతున్నారని సీఎం అన్నారు. అమరావతి నుంచి బెంగళూరుకు ఓ స్ట్రైట్ రోడ్డును వేయాలని నిర్ణయించామని తెలిపారు. దీనికి అమరావతి - బెంగుళూరు రోడ్డుగా పేరు పెట్టాలని కోరుతున్నామన్నారు. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా.. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో కేవలం 6 రోజుల్లోనే 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ చేపట్టింది. బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నాలుగు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది. జనవరి 6న 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల మేర రహదారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. రహదారుల నిర్మాణాన్ని ఐఐటీ బాంబే విద్యాసంస్థ పర్యవేక్షించింది.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం
తిరుపతిలో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..
Read Latest AP News And Telugu News