Share News

కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై ప్రధానంగా చర్చ..

ABN , Publish Date - Feb 10 , 2026 | 10:35 AM

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది..

కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై ప్రధానంగా చర్చ..
CM Chandrababu

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) సీఎం సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు ముఖ్యమంత్రి.


సీఎం చంద్రబాబు ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య అంశాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను(SWO) శాశ్వతంగా ఎత్తివేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఆర్డర్ వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలన్నారు. అలాగే ఫేజ్-II పనులకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్-IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని, దీనికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు.


గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదిత పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది. తాగు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు సీఎం. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా దీనికి అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదం పరిష్కారించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదికను వెంటనే గెజిట్‌లో ప్రచురించాలని, దీని ఆధారంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని ముఖ్యమంత్రి విన్నవించారు.


గోదావరి జలాల పంపకంపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదంపై కూడా చర్చించారు. ఈ వివాదం పరిష్కారం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు సీఎం. ఎగువ కృష్ణాపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు చేపట్టిన చర్యలపై సీఎం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 11:46 AM