విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:31 AM
ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని కూడా యూనిట్ రూ.3.90 లకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకే దక్కాలి
ఆర్టీసీలో 1,000 ఈవీ బస్సుల కొనుగోలు
మంత్రులు, కార్యదర్శులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని కూడా యూనిట్ రూ.3.90 లకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రూడౌన్ ఫలితాలు ప్రజలకే అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘‘నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలి. ఒక మీటరు వరకు భూగర్భ జలాలను పెంచడం ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లు ఆదా అవుతుంది. పీఎం కుసుమ్, సూర్యఘర్ పథకాల కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా చేపట్టాలి. కుప్పంలో ఇటీవల 5వేల పైచిలుకు ఈ-సైకిళ్లు పంపిణీ చేశాం. ఆర్టీసీలో కనీసం వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. స్వయం సహాయక సంఘాలకు ‘స్వయం’ అనే పేరుతో బ్రాండ్‌ను రూపొందించాం. ఈ బ్రాండ్ ద్వారా తయారు చేసిన ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. అరకు కాఫీ తరహాలోనే కోకో పంటలకు కూడా మంచి బ్రాండింగ్ రావాలి. సీమను ఉద్యాన రంగంలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేట్ పెట్టుబడులనూ ఆకర్షించాలి. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. దీనిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మరోవైపు పట్టణాలు, నగర ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి అసవరమైన భూ సేకరణ చేపట్టాలి. నిధులను పీసీబీ ద్వారా సమకూర్చుకోవాలి. తీర ప్రాంతంలో కోత నివారణకు ఉపముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టు అభినందనీయం’ అని చంద్రబాబు అన్నారు.
విద్యుత్తు ‘వ్యయాన్ని’ గణనీయంగా తగ్గిస్తాం: సీఎస్
విద్యుత్తు రంగంపై ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రజంటేషన్ ఇచ్చారు. ‘నీతి ఆయోగ్ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ట్రాన్సిషన్ బ్లూప్రింట్ (2025-35) ప్రకారం రాష్ట్రం శుద్ధ ఇంధన(క్లీన్ ఎనర్జీ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు దృఢంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో 2030 నాటికి యూనిట్ విద్యుత్తు కొనుగోలు వ్యయం రూ.4.20కి, 2035 నాటికి రూ.3.90కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకుంది. పర్యావరణ అనుకూల, తక్కువ వ్యయంతో కూడిన విద్యుత్తు సరఫరాను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ భవనాలపై 150 మెగావాట్ల వరకు సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది’ అని విజయానంద్ పేర్కొన్నారు. విద్యుత్తు శాఖ అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలైన పీఎం కుసుమ్, సూర్యఘర్ కార్యక్రమాల అమలును ఆయన వివరించారు.