Share News

3.25 లక్షల కోట్లతో రఫేల్‌ మెగా డీల్‌!

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:32 AM

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది.

3.25 లక్షల కోట్లతో రఫేల్‌ మెగా డీల్‌!

  • ఫ్రాన్స్‌తో ఒప్పందానికి భారత్‌ సిద్ధం

  • మెక్రాన్‌ పర్యటనలో సంతకాలకు ఛాన్స్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. దీనికి ఢిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం తెలపనుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతి పెద్ద డీల్‌ ఇదే అవుతుంది. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్న సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి అవకాశం ఉంది. 114 రఫేల్‌ విమానాల్లో 88 సింగిల్‌ సీట్‌ ఫైటర్లు, 26 ట్విన్‌ సీట్‌ శిక్షణ విమానాలు ఉంటాయి. ఈ విమానాలన్నీ పూర్తిగా ఎయిర్స్‌ఫోర్స్‌ కోసం మాత్రమే ఉద్దేశించినవి. 2016లో మోడీ-హోలెండే మధ్య 36 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు 114తో కలిసి మొత్తం మన ఎయిర్‌ఫోర్స్‌ వద్ద 150 ఎయిర్‌క్రా్‌ఫ్టలు ఉంటాయి. ఇక నేవీకి సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో రూ.63 వేల కోట్లతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ల కోసం 26 రఫేల్‌-ఎం జెట్‌ (22 సింగిల్‌ సీట్‌, 4 ట్రైనర్లు) సరఫరా చేయాల్సి ఉంటుంది. 2031 నుంచి వీటి రాక ప్రారంభవుతుంది. ఈ రెండు ఒప్పందాలతో భారత్‌ 176 రఫేల్‌ ఫైటర్లను కొనుగోలు చేసినట్లవుతుంది. కొత్త డీల్‌లో భాగంగా 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారవుతాయి. మిగతా 96 దేశీయంగా తయారు చేస్తారు. వీటి సరఫరా 2030 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందంలో దేశీయంగా ఉత్పత్తి చేయడమే కీలకం. విమానాల తుది అసెంబ్లింగ్‌ నాగ్‌పూర్‌లోని దసో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డీఆర్‌ఏఎల్‌)లో, ముఖ్యమైన భాగాలు, ఫ్యూస్‌లేజ్‌ సెక్షన్‌, రెక్కలు హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో తయారుకానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో ప్రత్యేకంగా ఎంఆర్‌వోను దసో ఏవియేషన్‌ స్థాపిస్తుంది. ఎం-88 ఇంజిన్ల ఉత్పత్తి, సహాయక ప్లాంట్‌ను హైదరాబాద్‌లో సఫ్రాన్‌ ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ వాస్తవ దేశీయ విలువను పెంచుతాయని అధికారులు తెలిపారు. ఇక దేశీయ ఆయుధాలను కూడా రఫేల్‌ యుద్ధ విమానాలను అనుసంధానం చేస్తారు.


3,200 కోట్ల స్కాల్ప్‌ క్షిపణి డీల్‌పై దృష్టి

ఆపరేషన్‌ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన స్కాల్ప్‌ క్షిపణుల డీల్‌పై భారత్‌, ఫ్రాన్స్‌ దృష్టి పెట్టాయి. రూ. 3,200 కోట్లతో గణనీయమైన సంఖ్యలో ఈ దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను ఫ్రాన్స్‌ నుంచి కొనడానికి భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) చేస్తున్న చర్చలు తుది దశకు వచ్చాయి. వీటి కొనుగోలు ప్రతిపాదనకు త్వరలో ఢిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం తెలపనుంది. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఏరోస్పేస్‌ పరిశ్రమను స్థాపిద్ధామని భారత ప్రభుత్వానికి స్వీడన్‌ సంస్థ ఎస్‌ఏఏబీ (సాబ్‌) ప్రతిపాదించింది. బహుళ అంచల రూపకల్పన, ఉత్పత్తి, నిర్వహణతో పాటు గ్రిపెన్‌-ఇ యుద్ధ విమానాల ప్రవేశాన్ని కూడా కలిగి ఉండేలా దానిని తీర్చిదిద్దాలని పేర్కొంది. ఈ మేరకు గ్రిపెన్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఏరోనాటిక్స్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌ ఫ్రాంజెన్‌ చెప్పారు. సింగపూర్‌లో జరిగిన ఎయిర్‌షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు.

Updated Date - Feb 10 , 2026 | 10:29 AM