Share News

శివరాత్రి నాటికి ఆలయాల్లో పటిష్ఠ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:45 PM

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయంలో భక్తల రద్దీ దృష్ట్యా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

శివరాత్రి నాటికి ఆలయాల్లో పటిష్ఠ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 10: శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈ రోజు(మంగళవారం) సమీక్ష నిర్వహించారు. శివారాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి సీఎం సమీక్షించారు. శివరాత్రి నాటికి ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.


రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి అనిత.. ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సీఎం సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే, దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా.. సరైన వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశించారు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.


రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్

టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 04:58 PM