Share News

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:56 PM

స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 15: స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీశక్తి లబ్ధిదారులకు సీఎం.. తేనేటీ విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలు.. ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసి ఓట్లేయించుకునే వారిని నమ్మొద్దన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకూడదని మహిళలు ప్రచారం చేయాలని తెలిపారు.


చంద్రబాబు ప్రశ్నలు.. మహిళల సమాధానాలు

రాబోయే 10 ఏళ్లలో ఏయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటూ సీఎం ప్రశ్నలు వేశారు. కోటి రూపాయల పెట్టుబడితో తన డ్వాక్రా సంఘం నుంచి వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కడప జిల్లాకు చెందని ముస్లిం మహిళ తెలిపింది. ఏఐ రంగంలో నైపుణ్యం సాధించడం ద్వారా తాను ఎంచుకున్న సాఫ్ట్‌వేర్ రంగంలో టాప్ పొజిషన్‌లోకి వెళ్లాలని విశాఖకు చెందిన ఓ ఉద్యోగిని వివరించింది. స్త్రీ శక్తి ద్వారా సుమారు రూ.3 వేలు ఆదా చేసుకోగలుగుతున్నామని యువతి తెలిపింది. ప్రభుత్వం అందిస్తోన్న పథకాలతో మహిళలే ఎక్కువగా సంపాదిస్తున్నారని.. తాము కూడా మరికొందరికి ఉపాధి చూపగలుగుతున్నామని పలువురు మహిళలు చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణాలను చూడాలని ఉందని మహిళలు కోరగా.. రాజధానిలో మహిళల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


అదే ప్రభుత్వ లక్ష్యం..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి నేటితో ఏడాది పూర్తైందని.. ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. వివిధ ప్రాంతాలకు ఉచితంగా మహిళలు వెళ్లే వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు డబ్బులను ఆదా చేసుకోగలుగుతున్నారన్నారు. ‘రాబోయే రోజుల్లో అందరి ఆదాయం పెరగాలి.. అందరి ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు... దీన్ని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. బాగా వెనుకబడిన కుటుంబాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. వారిని ఆదుకునేలా... వారిలో చైతన్యం కలిగించేలా చేస్తున్నాం. అందరూ చదువుకుంటే మెరుగైన ఆలోచనలు వస్తాయి.. మంచి ఆలోచనలు వస్తే అభివృద్ధి అవుతారు. ఆ దిశగా మేం కృషి చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.


ప్రజారోగ్యం కోసం పని చేస్తున్నాం..

ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజారోగ్యం బాగుండేందుకు తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా ప్రచారం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. మహిళలు అంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదని.. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయిందన్నారు. మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల కోసం అభివృద్ధి-సంక్షేమానికి ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సంజీవని వంటి పథకాలతో ప్రజారోగ్యం కోసం పని చేస్తున్నామని చెప్పారు. వీటితో పాటు.. ఆర్థిక పరిస్థితులు మెరుగపడేలా వివిధ రకాల పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకోవాలని... డ్వాక్రా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలని... ఆర్థికంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు.


డ్వాక్రా సంఘాలను తెచ్చా.. ప్రొత్సహించా

పీ4 పథకం ద్వారా కూడా పేద కుటుంబాలకు చేయూతనిచ్చేలా మార్గదర్శులను ముందుకు తెస్తున్నామని సీఎం అన్నారు. డ్వాక్రా సంఘాలను తెచ్చానని.. ప్రొత్సహించానని తెలిపారు. రూ. 25 వేల కోట్లు డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు సొమ్ము బ్యాంకుల్లో ఉందని చెప్పారు. తీసుకున్న బ్యాంక్ రుణాలను తిరిగి చెల్లింపులు జరుపుతున్నారని తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా రుణాలను ఎగవేస్తున్నాయని, డ్వాక్రా మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను ఠంచనుగా చెల్లింపులు జరిపారని వెల్లడించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామన్నారు. ఇప్పుడు గంజాయి, బ్లేడ్ బ్యాచులను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు, అవగాహన పెంచేందుకు మహిళలు చొరవ తీసుకోవాలన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిని మహిళలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని తెలిపారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతిని రేకెత్తించే వారిని దూరం పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తుంటే... శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మహిళలను కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

స్త్రీశక్తి పథకానికి ఏడాది.. మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు ప్రయాణం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 02:24 PM