విజయవాడ ఉత్సవ్‌కు వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సీఎం విజయ్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:18 PM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడ ఉత్సవ్2.0కు వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ సీజన్ టూలో తమిళనాడు సీఎం విజయ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.
విజయవాడ, అక్టోబర్ 13: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడ ఉత్సవ్2.0కు వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ సీజన్ టూలో తమిళనాడు సీఎం విజయ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌కు విజయ్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేవలం రెండేళ్లలోనే పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. తమిళనాడును అభివృద్ధి చేయాలని విజయ్ కృషి చేస్తున్నారని చెప్పారు. తమిళనాడు సీఎం విజయ్ తొలిసారి విజయవాడకు వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రాలు వేరయినా.. మా అభిమతం ఒక్కటేనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతోపాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా బాగుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఏదైనా సాధ్యం.. కృష్ణ, గోదావరి నదులు విజయవాడ నుంచే కలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో గోదావరి, కృష్ణా, పెన్న, తుంగభధ్ర, కావేరి.. ఈ ఐదు నదులు అనుసంధానం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకు మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉంటాయని చెప్పారు. 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ ఉత్సవ్ సీజన్ టూలో నిర్వహించిన ఎన్నో కళా ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయని తెలిపారు. ఆకాశమే హద్దుగా అభిమానంతో ఇంత మంది వచ్చారని పేర్కొన్నారు. టెక్నాలజీ, నాలెడ్జ్ మనకు ఉందని.. దీనికి ఆధ్యాత్మికత కూడా తోడు కావాలని అన్నారు. ఇటువంటి ఉత్సవాల ద్వారానే ఆధ్యాత్మికత మరింత పెరుగుతుందని తెలిపారు. ఇటువంటి మరిన్ని ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Read Latest AP News And Telugu News