Share News

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ABN , Publish Date - Jun 04 , 2026 | 02:51 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం నిర్వకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈనెల 28లోపు ప్రజలకు వివరించాలన్నారు.

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Chandrababu Naidu

అమరావతి, జూన్ 4: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (గురువారం) సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్వాకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈనెల 28లోపు ప్రజలకు వివరించాలని ఆదేశించారు.


రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సీఎం చెప్పారు. దేశీయ, స్థానిక అవసరాల మేరకు పంటలు వేసే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నా ఎందుకిలా ఉన్నారని అధికారులపై సీరియస్ అయ్యారు. అగ్రిగోల్డ్ కేసులను వెంటనే పరిష్కరించేందుకు మొత్తం 31 కొత్త పోస్టులు మంజూరు చేసిన సీఎం.. వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.


ఏపీలో16 వేల టీచర్ పోస్టు‌లను భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూశారని మండిపడ్డారు. ‘మనం గట్టిగా తిప్పికొట్టడంతో ఇప్పుడు తోక ముడిచారు. మనం చెప్పేది వివరంగా ప్రజలకు తెలియజేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు తెలుస్తుంది’ అని వివరించారు. ఇటీవల రాజధానిలో కొంతమంది రైతులను జగన్ కలిశారని సీఎం చెప్పగా.. జగన్ దగ్గరకు వెళ్లిన అశోక్ అనే రైతు నిన్న నేలపాడులో తన భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులను జగన్ గందరగోళంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని.. కానీ రాజధాని రైతులు ఇప్పుడు కూడా జగన్ మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్నారని సీఎం అన్నారు. జగన్ చెప్పిన మాటలను నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ప్రజలకు నిజాలు వివరిస్తే వాళ్లు పూర్తిగా అర్థం చేసుకుంటారన్నారు. అమరావతి, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నంలో యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

ప్రతి పాటలో కొత్త భావాన్ని పంచిన మహాగాయకుడు ఎస్పీబీ: జగన్

ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. సైకిల్ యాత్రలో పాల్గొనండి: పల్లా శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 03:22 PM