Share News

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:22 AM

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై  ఛైర్మన్ ఆగ్రహం
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ శాసనమండలిలో(AP Legislative Council) వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సీరియస్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ సుదీర్ఘ ప్రసంగం చేయడంపై ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు. అయితే.. కల్యాణి మాట్లాడుతుండగా ఆడియో సరిగా రికార్డ్ అవలేదని బొత్స సత్యనారాయణ చెప్పగా.. ఏ సభ్యులు మాట్లాడినా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు.


మండలిలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. మహిళలపై దాడులకు సంబంధించి 1,485 కేసులు నమోదయ్యాయని, రోజుకు 4 నుంచి 5 అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో నేరాలు పెరుగుతున్నాయని.. మదనపల్లి ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఆడపిల్లలంటే ఎందుకింత వివక్ష అని ప్రశ్నించిన కల్యాణి.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మత్తు పదార్థాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని కల్యాణి ప్రశ్నించారు.


ఎవ్వరినీ వదలం: హోంమంత్రి

ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నకు హోం మంత్రి అనిత సమాధానం ఇస్తూ.. మహిళలపై నేరాలు తగ్గాయని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలన కోసం ‘ఈగల్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగులేదని తెలిపారు. గత ప్రభుత్వం ‘దిశ’ పేరుతో ఐదేళ్ల పాటు ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిందని విమర్శించారు. శక్తి యాప్‌ను తీసుకొచ్చి.. సర్వైలెన్స్‌ను పెంచి నేరాలను తగ్గిస్తున్నామని వివరించారు. మదనపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు హోం మంత్రి. ప్రభుత్వం తీసుకునే చర్యలను తట్టుకోలేక నేరస్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. పోక్సో కేసుల్లో మూడు నెలల్లోనే శిక్షలు విధించేలా చేశామన్నారు. డోర్ డెలివరీ చేసిన వారిని కూడా వెతికి చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరినీ వదలమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి చేరినట్లు గుర్తుచేస్తూ.. నేడు విద్యార్థులే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ రోడ్డెక్కారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు.. ‘అడవితల్లి బాట’పై మంత్రి సమాధానం

త్వరలోనే పశు వైద్యశాలల్లో వైద్యుల నియామకం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 12:40 PM