ఏపీ మోడల్‌కు కేంద్రం ఓకే.. దేశవ్యాప్తంగా ‘10శాతం’ నూకల బియ్యం
ABN , Publish Date - May 19 , 2026 | 03:58 PM
కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ ద్వారా సరఫరా చేసే బియ్యంలో 10 శాతం నూకల విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది.
న్యూఢిల్లీ, మే 19: కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో కలిసి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార శాఖ ఉన్నతాధికారులతో కూడా ఏపీ మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ ద్వారా సరఫరా చేసే బియ్యంలో ‘10 శాతం’ నూకల (బ్రోకెన్ రైస్) విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిన 10 శాతం నూకల పైలట్ ప్రాజెక్ట్‌ను కేంద్ర ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రజలకు అత్యంత నాణ్యమైన బియ్యం సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ విధానానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దేశవ్యాప్తంగా 10 శాతం నూకల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న 25 శాతం నూకల విధానానికి బదులుగా 10 శాతం నూకల విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం సరఫరా అవుతుందని తెలిపారు. బియ్యం పంపిణీ సక్రమంగా, సద్వినియోగం అయ్యేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా ఏపీలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. ఏపీ స్ఫూర్తిగా నిలిచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు కావడం సంతోషంగా ఉందని అన్నారు.
ఏపీలో వచ్చే ఖరీఫ్ పంట సన్నద్ధతపైనా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చించినట్లు మంత్రి చెప్పారు. పౌరసరఫరాల విభాగం ద్వారా బయటకు వెళ్లే ప్రతి బియ్యం బస్తాను గుర్తించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ రబీ సీజన్‌లో ఏపీ నుంచి పెద్ద మొత్తంలో ఉప్పుడు బియ్యం(బాయిల్డ్ రైస్) దిగుబడి అయిందన్నారు. దీనిలో భాగంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపిందని అన్నారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించేందుకు కూడా కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. రక్షణ దళాలకు చెందిన అన్ని ‘స్టోర్స్’లో అరకు కాఫీ లభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఆ నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం.. కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News