Share News

పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , Publish Date - May 19 , 2026 | 03:13 PM

పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో పక్షపాతం చూపారని మండిపడ్డారు

పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao

హైదరాబాద్, మే 19: బీఆర్ఎస్ నేతలకు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2015లో అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని... రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారని గుర్తు చేశారు. లక్ష కోట్ల ప్రాజెక్టును పదేళ్లలో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 90 శాతం ఎలా పూర్తి అయినట్లు అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లు ఖర్చు చేసి ఎలా పూర్తి చేశారని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.


గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో పక్షపాతం చూపారని మంత్రి మండిపడ్డారు. కల్వకుర్తి పంపులు బాగు చేయలేకపోయారన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులు సాధించలేకపోయారని తెలిపారు. కృష్ణా నీటిని పదేళ్లు ఏపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పింది బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. గద్వా‌ల్‌లోని ర్యాలంపాడు రిజర్వాయర్‌ను పదేళ్లలో రిస్టోర్ చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి చర్చించామని చెప్పారు. సీఎం కూడా పాలమూరు వాసి కాబట్టి.. ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కల్వకుర్తి కింద చేపట్టనున్న గొల్లపల్లి రిజర్వాయర్‌ను చేపట్టవద్దని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి...

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక సూచనలు

భార్యపై కత్తితో దాడి చేసి చంపేసిన భర్త

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2026 | 04:55 PM