నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు: బొండా ఉమా
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:28 PM
‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
అమరావతి: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై వస్తున్న విమర్శలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యానని, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని అన్నారు. కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభకు అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని బొండా ఉమా తెలిపారు. ఆ సభలో తాను పాల్గొనడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 'సభలో నేను కూర్చున్న కుర్చీ పక్కకు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వచ్చి పలకరించారు. అది వాస్తవం. కానీ దాన్ని వేరే విధంగా ప్రచారం చేస్తున్నారు’ అని బొండా ఉమా పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని బొండా ఉమా స్పష్టం చేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాలను, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. ‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. చేయను’ అని పేర్కొన్నారు.
కాగా, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో బొండా ఉమా వేదిక పంచుకోవడం, ఇద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ అధిష్ఠానం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో వివరణ ఇవ్వాలని బొండా ఉమాను ఆదేశించింది.
Also Read:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్