Share News

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:19 PM

సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Trainee IPS Uday Krsihna Reddy

హైదరాబాద్, జులై 28: సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

శంకరపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తును ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బదిలీ చేశారు.


స్పందించిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డినీ చట్ట పరిధిలో ప్రొసీజర్ ప్రకారం విచారిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డీసీపీ మాట్లాడుతూ.. ఈ కేసులో నమోదైన సెక్షన్లు, ఆధారాలు బేస్ చేసుకొని అతడిని విచారిస్తామని చెప్పారు. అరెస్టు చేయాలా? లేక నోటీసులు ఇచ్చి విచారించాలా? అనేది అతడిపై నమోదైన సెక్షన్స్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కొన్ని అభియాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని తర్వాత వెల్లడిస్తామని అన్నారు. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.


ఆరోపణలు.. స్పందించిన ఉదయ్..

అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మంగళవారం అతడు స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమేనని కొట్టిపారేశారు. తన నానమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తన స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చినట్లు తెలిపారు. తనకు న్యాయ, పోలీస్ వ్యవస్థలపై నమ్మకం ఉందని స్పష్టం చేశారు. అయితే తనది పూర్తిగా గ్రామీణ నేపథ్యం అని గుర్తు చేశారు. తన శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 07:22 PM