పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
ABN , Publish Date - May 04 , 2026 | 04:23 PM
అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
విజయవాడ, మే 4: పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చడంపై విజయవాడలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్వీట్లు తినిపించి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్నారు. అక్కడ కమ్యూనిస్టుల పాలనలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయని విమర్శించారు.
2011లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. 2021లో 70 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు దాదాపు రెండు వందల స్థానాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోందన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ.. అరాచకాలు, విధ్వంసకర ధోరణికి పాల్పడ్డారని, దేశ హితానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్లే మమత గెలుస్తూ వచ్చారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేవలం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వార్థం చూసుకున్నారని మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
పోలింగ్ రోజు కూడా అనేక దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిని అధిగమించి అక్కడి ప్రజలు మమత కుట్రలను తిప్పి కొట్టారన్నారు. బీజేపీపై నమ్మకంతో దాదాపు 200 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో చొరబాట్లను మమతా ప్రోత్సహించడం వల్లే గెలిచారంటూ తాము చెప్పిన మాటలే ఇప్పుడు నిజమని తేలాయన్నారు. బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ జెండా రెపరెపలాటడటం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ప్రజలకు ఒకే చట్టం, ఒకే జాతీయ పతాకం ఉండాలని 1951లో ఇదే వెస్ట్ బెంగాల్‌లో ఆయన ఉద్యమం చేశారని గుర్తుచేశారు.
పార్టీ ఆవిర్భావం, శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సమయంలో వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించడం గొప్ప విషయమని శ్రీనివాస వర్మ అన్నారు. భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. కేరళంలో బీజేపీ రెండు స్థానాలతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతోందన్నారు. తమిళనాడులో స్టాలిన్ పార్టీ కూడా ఓటమి దిశగా పయనిస్తోందన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసిన వారిని ప్రజలే ఓడించారన్నారు. బీజేపీకి విజయాన్ని అందించిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర నేతలు, కార్యకర్తలకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
మరో మూడేళ్లు విద్యార్థులకు రాగిజావా పంపిణీ.. మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్
Read Latest AP News And Telugu News