మరో మూడేళ్లు విద్యార్థులకు రాగిజావా పంపిణీ.. మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
ABN , Publish Date - May 04 , 2026 | 02:42 PM
విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, మే 4: ఏపీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. 2026-29 కాలానికి ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది.
మెనూలో మార్పులు చేసి ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన, శుచిగా భోజనం అందించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక పర్యవేక్షణ వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో కాలపరిమితి ముగిసింది. విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే ఉద్దేశంతో మరో మూడేళ్లు కొనసాగించాలని విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి...
తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ
ఎన్డీయే ఆధిక్యం.. ఏపీలో బీజేపీ నేతల సంబరాలు
Read Latest AP News And Telugu News