సీఎం ఆదేశాల మేరకు కారుణ్య నియామకాలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:05 PM
ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఎప్పటికప్పుడు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో అర్హత మేరకు ఇంజినీరింగ్ ఉద్యోగాలు ఒక్కరికీ ఇవ్వలేదని మంత్రి విమర్శించారు..
అమరావతి, జనవరి 30: విద్యుత్ శాఖలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద 27 మంది అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు మంజూరు చేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సహా విద్యుత్ శాఖలోని పలు సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) నియామక పత్రాలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఎప్పటికప్పుడు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో అర్హత మేరకు ఇంజినీరింగ్ ఉద్యోగాలు ఒక్కరికీ ఇవ్వలేదని విమర్శించారు. ఉన్నత విద్యార్హత ఉన్నవారికి కూడా ఆఫీసు సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాల మేరకు అభ్యర్థి అర్హతకు తగిన ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైనవారికి జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలకు 600 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. కారుణ్య నియామకాల్లో జాప్యం లేకుండా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
ఉద్యోగుల భద్రతే మా బాధ్యత: సీఎస్
సీఎస్ కె. విజయానంద్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే కారుణ్య నియామకాలు చేపడుతున్నామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అభ్యర్థుల అర్హతకు తగిన ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. ఏడాది లోపు దరఖాస్తు చేసుకోలేకపోయినవారికి కూడా సడలింపులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఉద్యోగుల భద్రత, యోగక్షేమాలు కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రమాదాలబారిన పడిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులంతా తమ స్కిల్ పెంచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి సాధించాలని సీఎస్ విజయానంద్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి...
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం
Read Latest AP News And Telugu News