Share News

లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:40 PM

మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడైన బాలాజీ యాదవ్, అతడి తండ్రి కుల్లాయప్ప పేరిట ఉన్న ఆస్తుల అటాచ్‌కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం
AP Liquor Scam

అమరావతి, ఫిబ్రవరి 6: వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు బాలాజీ యాదవ్ ఆస్తుల అటాచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) ఆదేశాలు జారీ చేసింది. ఆయన తండ్రి కుల్లాయప్ప పేరిట ఉన్న ఆస్తులనూ అటాచ్ చేయాలని సర్కార్ ఆదేశించింది. ఏపీఎస్‌బీసీఎల్‌లో 2019-24 మధ్య కాలంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది. తిరుపతి సమీపంలోని రేణుగుంట, మంగళం, సెట్టిపల్లి గ్రామాల పరిధిలో విలువైన భూములను కుల్లాయప్ప పేరిట నిందితులు రిజిస్టర్ చేయించారు. వసుప్రాధ ఎన్‌క్లేవ్ లేఅవుట్‌లో ఉన్న ప్లాట్లనూ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.


తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వైకుంఠపురంలోని ఓ నివాస భవనాన్ని కుల్లాయప్ప పేరిట రిజిస్టర్ చేయించారు నిందితులు. బాలాజీ యాదవ్‌కు గిఫ్ట్ డీడ్‌ల పేరిట రిజిస్టరైన ఆస్తులకూ.. అక్రమ మద్యం ఆదాయం నుంచే సొమ్ములు చెల్లించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. తిమ్మాయగుంట, వెంకటాపురం గ్రామాల్లోని ఓపెన్ ప్లాట్‌ను మద్యం అక్రమ నగదుతో కొనుగోలు చేశారని సమాచారం. అలాగే.. గాంధీపురం పంచాయతీ పరిధిలో గల ఓ ఇంటినీ 2021లో అక్రమార్జనతోనే కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.


సిట్ దర్యాప్తులో భాగంగా ఆస్తి పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా మద్యం కుంభకోణం ద్వారా పొందిన అక్రమ లాభాలతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు అధికారులు తేల్చారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. ఈ ఆస్తులన్నింటినీ అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో చట్ట ప్రకారం.. తదుపరి చర్యలు చేపట్టి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు.. ఈ ఆస్తులపై తదుపరి లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్‌‌ ఆధారంగా..

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 04:39 PM