Share News

బందరులో పీతల హేచరీ ఏర్పాటు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - May 19 , 2026 | 01:49 PM

మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన మత్స్యకారుల సేవలో.. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బందరులో పీతల హేచరీ ఏర్పాటు: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

మచిలీపట్నం, మే 19: మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలూ చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేట నిషేధ భృతిని మత్స్యకారులకు తొలిసారిగా ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలుత బియ్యం, నిత్యవసర వస్తువులతో పాటు డీజిల్ సబ్సిడీ కోసం నాడు నడకుదిటి నరసింహరావు కృషి చేశారని వివరించారు.


మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఏకంగా రూ. 20 వేలకు పెంచామని కొల్లు రవీంద్ర వివరించారు. తనకు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసునన్నారు. రూ.4,000తో ప్రారంభించిన వేట నిషేధ భృతిని రూ.20 వేల వరకు పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూ.260 కోట్లు మత్స్యకార భరోసా పథకంతో మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయడం హర్షణీయమన్నారు. మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేలా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి జీవో నెం.217 తీసుకొస్తే.. దానిని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు.


కృష్ణా జిల్లాలో 18 వేల మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతిని అందించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వివరించారు. డీప్ సీ బోట్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.20 కోట్లు కేటాయించినా.. ఇక్కడ సదుపాయాలు లేవన్నారు. సీ వీడ్ (సముద్రపు నాచు) పండించడం ద్వారా కూడా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో రూ.75 లక్షల వ్యయంతో పీతల హేచరీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. మత్స్యకారులు 250 బోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పడం హర్షణీయం అన్నారు. మత్స్యకారులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూకట్‌పల్లి లులు హైపర్ మార్కెట్లో అధికారుల తనిఖీలు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

For AP News And Telugu News

Updated Date - May 19 , 2026 | 02:18 PM