వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్‌కు మంత్రి సంధ్యారాణి రియాక్షన్..
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:14 PM
శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు చేసిన ఛాలెంజ్‌కు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించారు.. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు మంత్రి..
అమరావతి, ఫిబ్రవరి 20: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు వేంకటేశ్వరుడి ఫొటోలు, ప్లకార్డులతో నిరసనకు దిగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెప్పులు, బూట్లతో దేవుడిని అవమానించారంటూ కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో తాము సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫోటో, వీడియో చూపించినా ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్ విసిరారు.
ఈ ఛాలెంజ్‌పై వెంటనే స్పందించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. వైసీపీ సభ్యులు మండలిలో చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని మాధవరావును మంత్రి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఫొటోలను.. ప్లకార్డుల తరహాలో వాడటం దుర్మార్గమని మండిపడ్డారు. స్వామి వారి ఫొటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారని.. ఇంకొకరు నిరసన అవ్వగానే టేబుల్‌పై పడేశారని విమర్శించారు. దేనికోసం డిమాండ్ చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
వికృత చేష్టలతో స్వామి వారిని అవమానించిన తీరు.. మనసును కలచివేసేలా ఉందన్నారు. దేవుడి పట్ల భయం - భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన తమ నాయకుడికి సన్మానం చేయాల్సింది పోయి.. నిందిస్తారా అంటూ వైసీపీ నేతలు మైండ్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 5 కోట్ల మంది ప్రజలకు జగన్, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పి తీరాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు.. టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు..
వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా
Read Latest AP News And Telugu News