వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.. రైతన్నల జీవితాలు మారుస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:01 PM
వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. వెలిగొండకు శంకుస్థాపన చేసింది తానే అని.. పూర్తి చేసేది కూడా తానే అని సీఎం తెలిపారు.
అమరావతి, మార్చి 5: వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన రోజును గుర్తుచేస్తూ.. ఇప్పుడు పనులను పూర్తి చేసి నీటిని అందించే అవకాశం తనకే వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
సీఎం ట్వీట్ ఇదే..
1996 మార్చి 5.... ఆ రోజు తనకు ఇంకా గుర్తుందన్నారు సీఎం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో.. జలాశయం ఫోర్‌షోర్ నుంచి 43.50 టీఎంసీల నీటిని వినియోగించుకునే ఆలోచనతో 30 ఏళ్ల క్రితం ఇదే రోజున (1996 మార్చి 5న) ముఖ్యమంత్రిగా తాను వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసినట్లు తెలిపారు.
అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశామన్నారు సీఎం. ప్రాజెక్ట్ కోసం రూ.1,414 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం పేరుతో ప్రజలను మోసం చేసి నవ్వులపాలు అయ్యిందని సీఎం అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రూ.140 కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేశామని, రూ.585 కోట్లు నిర్మాణంపై ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని అన్నారు .రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జులై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 2027-28 నాటికి ఫేజ్-2 నిర్మాణం కూడా పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. దశాబ్దాల కలను నిజం చేసి, కరువు ప్రాంతంలో ప్రతీ ఎకరానికి నీళ్లిచ్చి రైతన్న జీవితాలు మారుస్తామని.. హార్టికల్చర్ సాగుతో జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ‘వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే... పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News