Share News

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:28 PM

ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్‌జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల
AP Cabinet Decisions

అమరావతి, మార్చి 26: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమవేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మీడియాకు వివరించారు. ఎల్పీజీ సిలెండర్‌ల‌కు సంబంధించి ఏపీ క్యాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎల్పీజీ సిలెండర్‌లు వాడుతున్న వారు గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖ వంటి నగరాల్లో పైప్డ్ గ్యాస్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పీఎన్‌జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు. అపార్టమెంట్స్, ఇండస్ట్రీయల్ యూనిట్‌లు ఈ స్కీమ్‌ను వాడుకుంటే కేంద్రం ఇన్సెంటివ్‌లు కూడా వస్తాయని వెల్లడించారు.


ప్రధాన దేవాలయాల్లో పీఎన్‌జీ ఫెసిలిటీ తీసుకోవాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌కు ఈ విషయంలో ఎక్కువ సౌలభ్యం ఉందని అన్నారు. జీఎస్టీని 5 శాతం నుంచి 25 శాతానికి పెంచడం వల్ల లబ్ధిదారులు ముందుకు రాలేదని చెప్పారు. దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ సబ్ స్క్రైబర్స్‌కు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీపం పథకంలో నాలుగు నెలలకు ఒకసారి ఫ్రీ సిలెండర్ ఇస్తున్నామని.. పీఎన్‌జీలో రెండు నెలలకు ఒకసారి ఆ పేమెంట్‌ను షేర్ చేస్తామన్నారు. రూ.2,400 డీబీటీ సొమ్మును మూడు సిలెండర్లకు సమానంగా పైప్డ్ గ్యాస్ పైప్‌లైన్‌కు మారేవారికి బదిలీ చేస్తామన్నారు.


24 గంటల్లోనే పైప్ లైన్లు వేసుకోవడానికి అనుమతులు అందిస్తామని లేదా ఆటోమెటిక్‌గా అనుమతులు వచ్చేస్తాయని మంత్రి తెలిపారు. పీఎన్‌జీకి 10 లక్షల కొత్తకనెక్షన్‌లు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు. నెలరోజుల్లో లక్షమందికి అందించేలా చర్యలు తీసకుంటామని చెప్పారు. సోషల్ మీడియా భయాందోళనలు సృష్టిస్తోందని.. ఏపీలో ఎక్కడా పెట్రోల్, గ్యాస్, డీజిల్ విషయంలో కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు 2 లక్షల 70 వేల మందికి గ్యాస్ సిలెండర్‌లు అందిస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇండక్షన్ స్టవ్‌లు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నామని, ఆ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పాలసీగా తీసుకుని అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


రాజధాని అమరావతిపై..

రాజధాని అమరావతి అంశంపై కూడా ఏపీ కేబినెట్‌‌లో చర్చ జరిగింది. 2014లో గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. ఈసారి సీఆర్‌డీఏ పరిధిలో అమరావతిని రాజధానిగా పేర్కొని తీర్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 28న అసెంబ్లీలో అమరావతి రాజధాని అంశంపై తీర్మానం చేసి పంపుతామని ప్రకటించారు. రాజధాని చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సీఎం స్పష్టం చేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మారిన రాజధాని మళ్లీ అమరావతికి వచ్చిందని వివరించారు. 2014లో జగన్‌మోహన్ రెడ్డి కూడా గుంటూరు - విజయవాడ మధ్యే రాజధాని అని సమర్థించారని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని మార్చారన్నారు. ఆ సమయంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్‌పై దాడి చేసినంత పని చేశారని విమర్శించారు.


అమరావతి రాజధాని అని తీర్మానం చేసి పంపాలని పీఎంఓ చెప్పిందని సీఎం తెలిపారు. శనివారం(మార్చి 28) అసెంబ్లీలో తీర్మానం చేసి అదే రోజు సాయంత్రానికి పంపుతామని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందని పీఎంఓ తెలిపిందని సీఎం వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారని సీఎం చెప్పారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజధానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు రైతులు.. ధర్మాసనం సభ్యులకు పూలు చల్లి వీడ్కోలు పలికారని సీఎం గుర్తుచేశారు. డీలిమిటేషన్ వల్ల అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయని, దీని ద్వారా 50 శాతం మందికి అవకాశాలు వస్తాయని వివరించారు. రాజకీయ పార్టీలకు ఇది మంచి అవకాశమని చంద్రబాబు అన్నారు. మార్చి 28న ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు గంటల పాటు చర్చ నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.


విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలో నష్టాలను తగ్గించేందుకు ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సూర్యాఘర్ పథకం కింద ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ప్రతి నియోజకవర్గంలో 2,000 రూఫ్‌టాప్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. 33/11 కెవి సబ్‌స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 04:15 PM