Share News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:51 PM

స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై శాసనసభలో లఘు చర్చ జరిగింది. మంత్రి సవిత ఈ చర్చను ప్రారంభించారు. బీసీలకు అవకాశం ఇవ్వడం, ప్రాతినిధ్యం కల్పించడం రాజకీయ సాధికారిత కల్పించడం తమ విధి అని చెప్పారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత
Minister Savitha

అమరావతి, ఆగస్టు 18: స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై శాసనసభలో లఘు చర్చ జరిగింది. మంత్రి సవిత ఈ చర్చను ప్రారంభించారు. బీసీలకు అవకాశం ఇవ్వడం, ప్రాతినిధ్యం కల్పించడం రాజకీయ సాధికారిత కల్పించడం తమ విధి అని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఈరోజు మంత్రి మండలిలో ఆమోదించామన్నారు. జగన్ హయాంలో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వైసీపీ నిర్వాకం వల్ల బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.


గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని.. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. బీసీలకు మొట్టమొదటిసారిగా 1994లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని.. రిజర్వేషన్లలో 10 శాతం కోత వల్ల 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారని తెలిపారు. బీసీలకు మరోసారి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామని చెప్పారు.


బీసీలకు రాజకీయ పట్టం కల్పిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు సవిత ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు రాకతో బీసీలకు మరోసారి మంచిరోజులు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత మొదటి బడ్జెట్‌లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్ లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.51 వేల కోట్లు బీసీలకు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వ తదుపరి చర్యకు పంపించామని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.


బీసీల గురించి మంత్రి మరికొన్ని వ్యాఖ్యలు..

  • గీత కార్మికులకు మద్యంషాపులు, బార్లు కేటాయింపుల్లోనూ 10 శాతం మేర కేటాయించాం

  • మద్యం షాపుల లైసెన్స్లో 50 శాతం రాయితీ ఇచ్చాం.

  • గీత కార్మికులు.. కార్మికులుగా మిగిలిపోకూడదని.. వ్యాపారులుగా ఎదగాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యం

  • వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు, 50 శాతం మేర సినరేజీ మినహాయింపు ఇచ్చాం

  • చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచాం

  • మత్స్యకారుల వినతి మేరకు జీవో 217 రద్దు

  • నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

  • దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచాం...

  • 62,541 నేతన్నలకు 200లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్

  • 85,940 మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం

  • 71,536 మంది చేనేతలకు నేతన్నల సేవలో పథకం వర్తింప జేశాం

  • కొత్తగా దరఖాస్తులు వచ్చాయి...వాటిలో అర్హులను గుర్తించి రూ.25 వేలు అందజేస్తాం

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2024-26 మధ్య 15.67 లక్షల బీసీ లబ్ధిదారులకు రూ.15,588.64 కోట్లు చెల్లింపు

  • దీపం -2 కింద 13.46 లక్షలకు పైగా బీసీ లబ్ధిదారులకు రూ.5085.93 కోట్లు చెల్లించాం

  • ఫీజు రీయింబర్స్ మెంట్ కింద 2025-26లో 1.17 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.911.10 కోట్లు అందజేశాం

  • తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందజేశాం

  • ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా 40,610 మంది ఆటో డ్రైవర్లకు రూ.60.91 కోట్లు కేటాయించాం

  • పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కూటమి ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు రాయితీ అందజేస్తోంది..

  • తల్లికివందనం, ఫ్రీ బస్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత ఇసుక, పెన్షన్లు ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలే అని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ

ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 04:16 PM