Share News

ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:51 PM

దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని తెలిపారు.

ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ
Minister Anam Ramanarayana Reddy

అమరావతి, ఆగస్టు 18: దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో దేవాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లో భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన దేవాలయాల్లో ఖాళీలను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.


ప్రాంతంతో సంబంధం లేకుండా వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, ప్రతిభ, మెరిట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రముఖ దేవాలయాలకు చెందిన వేద, ఆగమ పండితులను ఎంపిక కమిటీల్లో సభ్యులుగా నియమించి ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. సుమారు 1,400 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారని.. పోటీ తీవ్రంగా ఉండటంతో ఒకటి, రెండు మార్కుల తేడాతోనూ ఎంపికలు జరిగాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుంచి 1,431 దరఖాస్తులు వచ్చాయని.. అర్హత సాధించిన వారిలో 172 మందికి అవకాశం లభించిందని ఆనం తెలిపారు. వేదం, సంస్కృతం, ఆగమ పరిజ్ఞానం వంటి అంశాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని అన్నారు. నియామక ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూల రికార్డింగ్‌ను అభ్యర్థులకు కూడా చూపించే విధంగా పారదర్శకత పాటించామని అన్నారు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద నియామకాల్లోనూ అర్హత, వేద పరిజ్ఞానం, మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరిగాయని చెప్పారు.


రాయలసీమ జోన్-4 పరిధిలో ప్రధాన దేవాలయాల్లో 440 పోస్టులు ఉన్నాయని.. ప్రస్తుతం జోన్-4 పరిధిలో 245 మంది పనిచేస్తున్నారని.. 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను నిబంధనల ప్రకారం త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రధాన దేవాలయాల్లో భక్తులకు శాస్త్రోక్తంగా, ఆగమబద్ధంగా సేవలు అందించేందుకు నైపుణ్యం కలిగిన అర్చకులు, వేద, ఆగమ పండితులు అవసరమన్నారు. రాయలసీమతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అర్హులకు పూర్తి పారదర్శకతతో, మెరిట్ ఆధారంగా న్యాయం జరిగేలా నియామకాలు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 03:28 PM