Share News

విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 17 , 2026 | 02:34 PM

మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు.

 విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 17: మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు. ఐటీని ప్రోత్సహించటం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవవనరుల్ని తయారుచేశామని అన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటినీ ఏర్పాటు చేసింది ఎన్టీఆరే అని అన్నారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాలలు లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.


ప్రతి కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డబ్బాలు కొట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 14 డీఎస్సీలు పెడితే, టీడీపీ హయాంలోనే 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు.


పాఠశాలలకు విద్యార్థులను హాజరుపర్చాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. ఇంటర్ విద్య వరకూ ఈ పథకాన్ని విస్తరించామని చెప్పుకొచ్చారు. మహిళలకు విద్యలో కూడా 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకువచ్చామని అన్నారు. గడిచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలు సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2019-24 మధ్య 10-12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడం మానేశారని, అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్థికసాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచటంతో 1 లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారన్నారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదని విమర్శించారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టామని చెప్పారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామన్నారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో, ఫలితాలను కూడా పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టామన్నారు.


జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశామన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా చెప్పారన్నారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చామని, ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్‌లోనే ఉందని... ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఒక్క డీవియేషన్ కూడా లేదని స్పష్టం చేశారు.


లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 3 వందలకు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారన్నారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డీఎస్సీ టీచర్లే రోడ్డుపైకి వచ్చారని తెలిపారు. కర్నూలులో, నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన చేశారన్నారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, ప్రతిభను కించపరిస్తే గుణపాఠం కూడా చెబుతామని నినదించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తుందని.. కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదని తెలిపారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదని వ్యాఖ్యానించారు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.


ఏపీలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నానని, పూర్తి పారదర్శకతతో బాధ్యతతో, పూర్తి జవాబుదారీతనంతో నియామకాలు జరిగాయని సీఎం అన్నారు. విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామన్నారు. బురదజల్లితే జీరో టాలరెన్సు అని హెచ్చరించారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలని.. చెప్పేది వాస్తవం అయితే సరిచేసుకుంటామన్నారు. ‘రెండున్నరేళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారి. అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలి. భవిష్యత్తులో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నాలుగు రోజుల పాటు ఏసీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 03:20 PM