వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:34 PM
వ్యవసాయంలో ఈ ఏడాది 16 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌పై మంత్రి ప్రసంగించారు.
అమరావతి, ఫిబ్రవరి 27: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌పై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ప్రసంగించారు. వ్యవసాయంలో డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం 11.64 శాతం వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ఈ సంవత్సరం 16 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సాగు సమాచారాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. 'రైతన్నా మీకోసం' పేరుతో ఇటీవల వారోత్సవాలు నిర్వహించామన్నారు. 22.5 లక్షల పంపుసెట్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నామని, ఉచిత విద్యుత్ కోసం రూ.13,720 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు.
చరిత్ర సృష్టించాం...
వరి, చెరకు వంటి పంటలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 31.21 లక్షల హెక్టార్లు కాగా, 33.03 లక్షల హెక్టార్లు సాగు జరిగిందన్నారు. రబీలో 22.08 లక్షల హెక్టార్లు సాగైందని తెలిపారు. యాంత్రీకరణ, డిజిటలైజేషన్‌పై దృష్టి సారించామని చెప్పారు. గతేడాది చాలా పంటల ధరలు తగ్గిపోయాయని, పొగాకు వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. మిర్చి ధర తగ్గినప్పుడు జగన్ గుంటూరు వెళ్లి ఆందోళన చేశారని, కానీ ఈ ఏడాది ధర పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశంసించాలి కదా అని వ్యాఖ్యానించారు. ష్రింప్ ఎక్స్‌పోర్టుల్లో అమెరికా సుంకాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నామని, కానీ ఇప్పుడు సుంకాలపై రిలాక్సేషన్ వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ హార్టికల్చర్ చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందోని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
వైసీపీ హయాంలో గృహనిర్మాణశాఖ నిర్వీర్యం: మాజీ మంత్రి
గృహనిర్మాణం, ప్రజాసంబంధాలు, సమాచార శాఖలపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 2019-24 మధ్య గృహనిర్మాణ శాఖ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టుమని 100 మంది కూడా ఒక కాలనీలో నివసించే పరిస్థితి లేదన్నారు. 4 లక్షల ఇళ్లను గతంలో అధికారంలో ఉండగా పూర్తి చేశామని తెలిపారు. 2 లక్షల 26 వేల టిడ్కో ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయకుండా జగన్ పేదల సొంతింటి కలను ఛిద్రం చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో 70-80 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయని.. చివరకు అవి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఇళ్లు నిరర్థకంగా మిగిలాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే 3 లక్షల ఇల్లు ప్రారంభించిందని తెలిపారు. ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద రూ.900 కోట్ల బకాయిలు జగన్ ఇవ్వలేదన్నారు. స్థలాలు, ఇళ్లకు దరఖాస్తులు తీసుకున్నామన్నారు. ఎక్కడ ఎన్ని ప్లాట్‌లు ఖాళీగా ఉన్నాయో చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2019-24 మధ్య అవినీతిని విచారించి, పేదలకు సొంతింటి కల నెరవేర్చుతారని అనుకుంటున్నామని అన్నారు. హౌసింగ్‌కు రూ.6,350 కోట్లు కేటాయించడం ఆనందించదగ్గ విషయమని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.
దృఢంగా టిడ్కో ఇల్లు: ప్రత్తిపాటి పుల్లారావు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రాష్ట్రంలో 17 లక్షల 63 వేల 760 గృహాలు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఐదేళ్లు గాలికి వదిలేసినా ధృడంగా ఉన్నాయని.. ఎవరైనా టిడ్కో ఇళ్లలోకి చేరకపోతే వాటిని వేరేవారికి కేటాయించాలని సూచించారు. చిలకలూరిపేటలో 241 ఎకరాలు కొని 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెక్కులు తీసుకున్నారని.. బాధితులు మాజీ మంత్రి రజనీపై కోర్టుకు వెళ్లి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. టిడ్కో ఇళ్లలో లిఫ్ట్ సౌకర్యం కల్పించడంపై ముఖ్యమంత్రి ఆలోచించాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.
జగన్‌పై మురళీమోహన్ విమర్శలు
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. సమాచారం, పౌరసంబంధాల శాఖకు రూ.329 కోట్లు కేటాయించారని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులను దోచుకోవడానికి దాచుకోవడానికే జగన్ వాడుకున్నారని విమర్శించారు. జర్నలిస్టులకు గృహాలు, స్థలాల విషయంలో ఆలోచించాలన్నారు. కేరళ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌లలో జర్నలిస్టులకు పెన్షన్ అమలులో ఉందని.. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పరిశీలించాలని మురళీమోహన్ కోరారు.
2029నాటికి పేదలకు ఇళ్లు: మంత్రి పార్థసారథి
బడ్జెట్ ప్రతిపాదనలపై అసెంబ్లీలో మంత్రి పార్థసారథి ప్రసంగించారు. గృహనిర్మాణం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమని తెలిపారు. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గృహనిర్మాణం కేవలం సంక్షేమం కాదు, రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.30 లక్షలు పెంచనున్నామని వివరించారు. వైసీపీ నేతల అక్రమాలతో గృహనిర్మాణం అస్తవ్యస్తమైందని, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో రాక్రీట్ సంస్థ రూ.80 కోట్ల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. పీఎంఎవై పథకంలో రూ.1882 కోట్లు కేటాయించారని తెలిపారు. జగన్.. గృహ నిర్మాణంపై సమీక్ష పెట్టి భారతి సిమెంట్స్ నుంచి లక్ష టన్నులు ఆర్డర్ చేశారని, తయారీ సామర్థ్యానికి మూడు రెట్లు ఆర్డర్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని మంత్రి పార్థసారథి ఆరోపణలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
10 సెకన్లలోనే మండలిని వాయిదా వేసిన ఛైర్మన్
వైవీ సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే: బాలినేని
Read Latest AP News And Telugu News