రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:08 PM
అంతర్జాతీయంగా యుద్ద వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు.
అమరావతి, మార్చి 10: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా యుద్ద వాతావరణం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు, వాటి సరఫరాపై ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.
'గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. కీలకమైన ఈ సమయంలో ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అధికారులు జిల్లాలవారీగా చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాము. అవసరం అయితే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్‌ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తాము' అని మంత్రి వెల్లడించారు.
'రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళ్తాము. గ్యాస్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్పీజీ గ్యాస్ సరఫరా, ఉత్పత్తి విషయంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి' అని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
అనకాపల్లిలో మైనర్ మృతి.. వీడిన మిస్టరీ
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..