మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:06 PM
రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారని మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతోందని మంత్రి తెలిపారు.
అమరావతి, మార్చి 10: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former CM YS Jaganmohan Reddy) పాలనపై మంత్రి కొలుసు పార్థసారథి(Minister Parthasarathi) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారని.. జగన్ చేసిన అప్పులు రూ.9.70 లక్షల కోట్లకు చేరాయని కాగ్(CAG) నివేదికే తేల్చిందని చెప్పారు. ఈ అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతోందని వివరించారు. జగన్ నిర్వాకంతో బ్యాంక్‌లు అప్పులు ఇవ్వడం మానేశాయని వ్యాఖ్యలు చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పు రూ.81 వేల కోట్లు అయితే.. రూ.87 వేల కోట్లంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. 2024 మొదటి మూడు నెలల్లో జగన్ రూ.27,025 కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో రూ.53 వేల కోట్లు అప్పు చేసిందని స్పష్టం చేశారు. జగన్ పాలనలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో పరిశ్రమలు తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. భారతి సిమెంట్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని మంత్రి ఆరోపించారు. భారతి సిమెంట్ రేటును రూ.3 పెంచి ప్రజలపై రూ.165 కోట్ల భారం మోపిందని విమర్శించారు. ప్రకటనల ద్వారా సాక్షి మీడియాకు సుమారు రూ.400 కోట్ల లబ్ధి చేకూర్చారని తెలిపారు. సాక్షి, భారతి సిమెంట్స్‌కు మాత్రమే ఆదాయం వచ్చేలా జగన్ కృషి చేశారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 వేల కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. 20 నెలల్లో 6.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. సొంత పార్టీ సర్పంచ్‌లనే జగన్ తన హయాంలో మోసం చేశారన్నారు. అన్నం పెట్టే రైతన్నకు డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. కూటమి పాలనలో 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములను రైతుల ఖాతాల్లో వేస్తున్నామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
Read Latest AP News And Telugu News