ఏపీలో ఎండ తీవ్రతపై హోం మంత్రి అనిత సమీక్ష.. కీలక ఆదేశాలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:08 PM
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హోంమంత్రి అనిత హెచ్చరించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను అధికారులందరూ అనుసరించాలని ఆదేశించారు.
అమరావతి, మార్చి 10: రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాల్పుల పరిస్థితులపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు(మంగళవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీఎస్‌డీఎంఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్లు, లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026’ను హోంమంత్రి ఆవిష్కరించారు. అధికారులందరూ ఈ ప్లాన్‌ను అనుసరించి ముందుకు సాగాలని ఆదేశించారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని మంత్రి అనిత హెచ్చరించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని.. వడదెబ్బ కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పశువుల రక్షణకు సంబంధించి సూచనలు జారీ చేయాలని సూచించారు. వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం బెడ్లు, మందులు, అంబులెన్సులు సిద్ధం చేయాలని వైద్యశాఖను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు.. ఎండ తీవ్రత జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
వృద్ధులు, పిల్లలు, బహిరంగ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాలని హోంమంత్రి తెలిపారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. తాత్కాలిక చలువ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్లు, బస్టాండ్లు, కూడళ్లు వంటి జనసమూహ ప్రాంతాల్లో తప్పనిసరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్జీవోలు, కమ్యూనిటీ గ్రూపుల ద్వారా మంచినీరు, మజ్జిగ వంటి పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచించారు.
ఇవి కూడా చదవండి..
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు.. పవన్ ప్రకటన
పెట్టుబడులు పెట్టండి.. బాధ్యత మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేశ్ ఆహ్వానం
Read Latest AP News And Telugu News