Share News

పెట్టుబడులు పెట్టండి.. బాధ్యత మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేశ్ ఆహ్వానం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:25 PM

ముంబైలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్‌పోలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమ్యూజ్‌మెంట్, థీమ్ పార్క్‌లు, వాటర్ పార్క్‌లు, అడ్వెంచర్ జోన్‌ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు.

పెట్టుబడులు పెట్టండి.. బాధ్యత మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేశ్ ఆహ్వానం
Minister Kandukuri Durgesh

ముంబై/అమరావతి, మార్చి 10: ముంబైలో ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన కొనసాగుతోంది. 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) ఎక్స్‌పోలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో అమ్యూజ్‌మెంట్, థీమ్ పార్క్‌లు, వాటర్ పార్క్‌లు, అడ్వెంచర్ జోన్‌ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, 2024-29 నూతన పర్యాటక పాలసీ ద్వారా ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్క్‌లు, వాటర్ ఫ్రంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్ జోన్‌ల ఏర్పాటుకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


సుదీర్ఘ తీరప్రాంతం, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఏపీలో వినోద రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనువైన వాతావరణం ఉందన్నారు. విమానాశ్రయాల విస్తరణ, మెరుగైన రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటివి రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతంగా మార్చాయని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ దార్శనికతతో 'స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047'ను రూపొందించామని మంత్రి దుర్గేశ్ చెప్పారు. హోటళ్లు, థీమ్ పార్క్‌లు, రిసార్టుల కోసం భూమి కేటాయింపు ప్రక్రియను సరళతరం చేస్తూ.. దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రకటించారు.


రూ.50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే వారికి ఎస్‌ఐపీబీ(SIPB) ద్వారా భూమి కేటాయింపులు జరుగుతాయని మంత్రి దుర్గేశ్ తెలిపారు. గత ఏడాది 102 ఒప్పందాల ద్వారా రూ.18,448 కోట్ల పర్యాటక పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో భారీ మెగా అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అద్భుత అవకాశాలను కలిగి ఉందన్నారు. విశాఖపట్నం ప్రీమియర్ కోస్టల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. తిరుపతిలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనువైన ప్రాంతమని మంత్రి వివరించారు.


టైర్-2, టైర్-3 నగరాల్లో చిన్న తరహా అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని, త్వరితగతిన రాబడిని అందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ పర్యాటక రంగం కొత్త శకంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వ సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల అనుకూల విధానాలు విజయానికి బాటలు వేస్తాయని ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేశ్ పిలుపునిచ్చారు. వినోద రంగంలో నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికి రాష్ట్రం అండగా ఉంటుందన్నారు. రేపటి ఉజ్వల పర్యాటక భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.


భారతదేశంలో అమ్యూజ్‌మెంట్ రంగం ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తోందని మంత్రి తెలిపారు. 2030 నాటికి రూ.25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో సుమారు 300 అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, 2,500 ఇండోర్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ‘ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి, భరోసా కల్పించే బాధ్యత మాది’ అని ముంబై వేదికగా ఇన్వెస్టర్లను మంత్రి కందుల దుర్గేశ్ ఆహ్వానించారు.


ఇవి కూడా చదవండి..

20 కేజీల గంజాయి అక్రమ తరలింపు.. నలుగురి అరెస్ట్

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు.. పవన్ ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 01:09 PM