Share News

గొడ్డలిపార్టీ రెచ్చగొట్టినా.. రైతులు అమరావతికి సహకరించారు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:58 AM

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు.

గొడ్డలిపార్టీ రెచ్చగొట్టినా.. రైతులు అమరావతికి సహకరించారు: మంత్రి నారాయణ
Minister Narayana

అమరావతి, ఆగస్టు 13: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు(గురువారం) సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను, బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు ముంబాయి, బెంగళూరు, చెన్నైల ద్వారా ఆదాయం వస్తోందని తెలిపారు. ఆర్థిక రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించిందని చెప్పుకొచ్చారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నార్మల్ ఫాస్టర్స్ లండన్ వారిని సంప్రదించినట్లు తెలిపారు. కృష్ణానది ఒడ్డున అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు.


అమరావతి.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మధ్యలో ఉంటుందని మంత్రి తెలిపారు. రైలు, రోడ్డు మార్గం అందుబాటులో ఉందన్నారు. 2015 జనవరిలో ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ ఇచ్చామని.. కేవలం 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలను రైతులు ఇచ్చారని వివరించారు. అమరావతిలో పనులు ప్రారంభించడం, టెండర్లు పిలవడం, ఇతర పనులు చేపట్టడానికి మూడున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. మిగిలిన సంవత్సరం 6 నెలల్లో పదివేల కోట్లు అమరావతి కోసం ఖర్చు చేశామని అన్నారు.


ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేసిందన్నారు. నిర్మాణ సంస్థల ఒప్పందాలను క్లోజ్ చేయకుండా వదిలేసిందని.. దీంతో కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక ఆయా సంస్థలతో ఒప్పందాలను టెక్నికల్‌గా క్లోజ్ చేసి తిరిగి టెండర్లు పిలవాల్సి వచ్చిందని అన్నారు. గతంలో ఉన్న పనుల నాణ్యతను ఐఐటీ చెన్నై, హైదరాబాద్ వారితో పరీక్షింప చేసి పనులను ప్రారంభించామన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్‌ను ఆనుకుని ఎలక్ట్రికల్, గ్యాస్, టెలిఫోన్ వాటర్ వంటివి అండర్ గ్రౌం‌డ్‌లో ఉండేలా ప్లాన్ చేశామన్నారు. వైసీపీ ఓ గొడ్డలి పార్టీగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని.. అయినా రైతులు అమరావతి నిర్మాణానికి సహకరించారని తెలిపారు. ఇలాంటి అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ..

తొలి వేతనం అమర వీరుల కుటుంబాలకు.. గొప్ప మనసు చాటుకున్న ఎంపీ విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 12:15 PM