తన్నుకున్న టీడీపీ నేతలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:36 AM
కడప జిల్లా పులివెందులలో వినాయక మండపం వద్ద సన్మానం చేయలేదన్న వివాదంతో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఓ వర్గం మరో నేత ఇంటి వద్ద వాహనాలు, ఇంటిపై దాడికి దిగడంతో గన్‌మ్యాన్ గాలిలోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
వినాయక మండపంలో సన్మానం చేయలేదని ఘర్షణ
పులివెందులలో ఇరువర్గాలపై కేసు
పులివెందుల, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. వినాయకుని పూజ వద్ద తనకు కండువా కప్పి సన్మానం చేయలేదని ఓ టీడీపీ నాయకుడు మరో నాయకుడిపై దాడి చేశారు. ఆగ్రహానికి గురైన ఆ నాయకుడు అనుచర వర్గంతో వెళ్లి అతడి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఆయన ఇంటిపై దాడికి దిగారు. దీంతో గన్‌మ్యాన్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. పులివెందుల పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఓ లేఅవుట్‌లో టీడీపీ నేత పుష్పనాథరెడ్డి వినాయకుడిని ప్రతిష్ఠించారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి తదితరులు సోమవారం మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకున్నారు. పుష్పనాథరెడ్డి వారికి కండువాలు కప్పి తీర్థప్రసాదాలు అందించారు. ఇదే సమయంలో మరో నేత అక్కులుగారి విజయకుమార్‌రెడ్డి అక్కడే ఉన్నా.. ఆయనకు కండువా కప్పలేదు.
దీంతో బీటెక్ రవి వెళ్లిపోయాక విజయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘ఎవరిని ఎలా గౌరవించాలో తెలీని చిల్లరనా కొ..కు.’’ అని పుష్పనాథరెడ్డిని దూషించారు. దీనికి ప్రతిగా పుష్పనాథరెడ్డి.. ‘‘గత ఏడాది వినాయక పందిట్లో లడ్డూను వేలంలో రూ.12 లక్షలకు విజయ్‌కుమార్‌రెడ్డిదక్కించుకున్నాడు. రెండు లక్షలే ఇచ్చాడు. వాడే చిల్లరనాకొ..కు.’’ అని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన విజయకుమార్‌రెడ్డి బూతులు తిడుతూ పుష్పనాథరెడ్డిపై దాడికి దిగారు. చుట్టూ ఉన్నవారు జోక్యం చేసుకుని వారించడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం, సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పుష్పనాథరెడ్డి.. తన అనుచరులను వెంటబెట్టుకుని విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లారు. ఆ సమయంలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద హజ్‌కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా మరికొందరు ఉన్నారు. పుష్పనాథరెడ్డి వర్గీయులు వచ్చీరాగానే ఇంటిముందున్న వాహనాలపైన, ఇంటిపైన రాళ్లతో, కట్టెలతో దాడికి దిగారు. ఇంట్లో ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు బయటకు వచ్చి ప్రతిదాడులకు దిగారు. వెంటనే హజ్ కమిటీ డైరెక్టర్ గన్‌మ్యాన్ ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశామని సీఐ పురుషోత్తమరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మార్చికి 5.52 లక్షల ఇళ్లు పూర్తి
బోడెన్సీ సరస్సు ఈదిన డీఎస్సీ విజేత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News