వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. అరెస్టు నుంచి మినహాయింపునకు నో ఛాన్స్..
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:41 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరు పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరు పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన కేసుల్లో వైసీపీ ఎంపీపై కేసులు నమోదు అయ్యాయి. ప్రైవేట్ బౌన్సర్‌తో వాహనాన్ని టీడీపీ కార్యకర్తలపైకి నడిపిన ఘటనలకు సంబంధించి పుంగనూరు పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
అయితే, తనపై నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లు వేశారు. నేడు విచారణ సందర్భంగా ఒకే ఘటనపై నాలుగు కేసులు నమోదు చేయడం చెల్లదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషనర్‌కు ఆ సెక్షన్లు వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. పుంగనూరును ఎంపీ మిథున్ రెడ్డి తన అడ్డాగా భావిస్తూ వ్యవహరించారని పేర్కొన్నారు.
వేర్వేరు సమయాల్లో జరిగిన ఘటనల్లో పలువురు గాయపడ్డారని, అందుకే వేర్వేరు కేసులు నమోదు చేశారని కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించాలనే దురుద్దేశంతోనే పెద్ద కాన్వాయ్, అనుచరులతో ఎంపీ మిథున్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లారని ఆరోపించారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది గాయపడ్డారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇదే కేసులో ఫిర్యాదుదారుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వేంకటేశ్వర్లు, న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ స్థానిక ఎన్నికలు.. 4,372 ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
ఆర్నబ్ తుఫాన్ వేళ బాధితులకు భరోసాగా నిలిచిన మనమిత్ర