రాయలసీమకు మహర్దశ!
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:47 AM
రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. సీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులు చేయడంతో పాటు వివిధ పథకాల అమలులో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ రూ.8,022కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు.
రెండేళ్లలో రూ.8,022 కోట్లతో అభివృద్ధి పనులు
23 వేలకు పైగా రోడ్ల పనులకు రూ.4,523 కోట్లు
సీమ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో
అదనపు నిధుల మంజూరు.. పనులు వేగవంతం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. సీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులు చేయడంతో పాటు వివిధ పథకాల అమలులో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ రూ.8,022కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు. జలసంరక్షణ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరపరా, మినీగోకులాలు, ఉద్యాన సాగు, పారిశుధ్యం తదితర అంశాల్లో విశేష ఫలితాలు సాధించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం 13,326 పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరాపల్లి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పంటకుంటల నిర్మాణానికి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్లలో శ్రీకారం చుట్టారు. వీబీ జీరాంజీ పథకం జాతీయ స్థాయిలో ప్రారంభించడానికి కూడా రాయలసీమ ప్రాంతాన్ని వేదికగా ఎంచుకున్నారు.
ఫార్మ్ పాండ్లతో అదనపు ఆదాయం
సీమలో జలసిరులు పారిస్తూ పంటల సాగుకు అనుకూల పరిస్థితులు కల్పించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, జీవనోపాధిని మెరుగుపరిచే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. తొలిదశలో 8 జిల్లాల పరిధిలో రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో 40,837 పంటకుంటలు నిర్మించాలన్న లక్ష్యాన్ని అధిగమించగా, రెండో దశలో ఇప్పటికే 29,902 ఫార్మ్ పాండ్లు మంజూరై వివిధ దశల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిద్వారా సీమలో 50వేల ఎకరాలకు పైగా అదనంగా సాగులోకి వచ్చింది. రైతులకు రూ.55 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.
రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ
పల్లెపండుగ, పల్లెపండుగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా రూ.4,523 కోట్ల అంచనా వ్యయంతో 23వేలకు పైగా రోడ్ల పనులు చేపట్టారు. అందులో 4,630 కి.మీ. బీటీ, 3,067 కి.మీ. సీసీ రోడ్లు ఉన్నాయి. అత్యధికంగా వైఎ్‌సఆర్ కడప జిల్లాకు రూ.876 కోట్లు మంజూరు కాగా, అనంత కు రూ.691 కోట్లు, తిరుపతి జిల్లాకు రూ.521 కోట్లు, అన్నమయ్యకు రూ.518 కోట్లు, సత్యసాయి జిల్లాకు రూ.483కోట్లు కేటాయించారు. శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రూ.30కోట్లు అదనపు నిధులు మంజూరు చేశారు.
చకచకా అభివృద్ధి పనులు
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పులివెందుల మల్టీ విలేజ్ వాటర్‌స్కీమ్ పనులను రూ.280 కోట్లతో పూర్తి చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి పూర్తయిన 96 శాతం పనుల్లో 56 శాతం పవన్ చొరవతోనే పూర్తయ్యాయి. దీంతో పులివెందుల గ్రామీణ, సింహాద్రిపురం మండలాల పరిధిలో ప్రజలకు తాగునీరు అందుతోంది. డోన్ మల్టీ విలేజ్ స్కీమ్‌ను రూ.132 కోట్లతో చేపట్టారు. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఈ పథకం ద్వారా 3.5 లక్షల మందికి తాగునీరు అందనుంది. చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్‌కు రూ.2,370 కోట్లతో శ్రీకారం చుట్టారు. వచ్చే 30 ఏళ్లలో దాదాపు 25 లక్షల మందికి పైగా ప్రజల దాహార్తిని తీర్చే ఈ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా 15వేల మినీ గోకులాలు నిర్మించారు. మరో 3వేలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలోనే లక్ష్యాన్ని అధిగమించి 9,708 మినీ గోకులాలను అందుబాటులోకి తెచ్చారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల్లో కలిపి వ్యక్తిగత పశువుల షెడ్ల నిర్మాణానికే రూ.170 కోట్లకు పైగా వ్యయం చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా సుమారు 62వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీనిద్వారా ఎకరాకు ఏటా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఆదాయం లభిస్తోంది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పలు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం పూర్తిచేశారు. 50వేలకు పైగా వ్యక్తిగత కంపోస్ట్ గుంతలు, మరో 28 వేలకు పైగా ఇంకుడు గుంతలు నిర్మించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కేంద్రాలు, హస్త కళాకారుల కోసం ఫుడ్‌బ్యాంకుల ఏర్పా టు తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. సీమలో 13 నగర వనాల నిర్మాణం పూర్తి చేశారు. కల్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి సత్యసాయి ఎకో పార్క్, బద్వేల్, తిరుపతి, కైలాసగిరి, అన్నమయ్య జిల్లాలో కోడూరు, నంద్యాల జిల్లా పరిధిలో డోన్ తదితర ప్రాంతాల్లో నగర వనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ముసలమడుగులో కుంకీల స్థావరం
చిత్తూరు, అన్నమయ్య తదితర సరిహద్దు జిల్లాల్లో అడవి ఏనుగుల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు పలమనేరు నియోజకవర్గం పరిధిలోని ముసలమడుగులో స్థావరం ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచే కుంకీలు దాదాపు 15 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. వీటి రాకతో మానవ, ఏనుగుల ఘర్షణలు 75 శాతం, పంటల నష్టం 50 శాతం తగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి
కడప జిల్లా వెలిదండ్ల రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
Counterfeit: నాయుడుపేటలో రూ.200 దొంగనోట్లు