శభాష్ వరదారెడ్డి!
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:26 AM
కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు.
కడప జిల్లా వెలిదండ్ల రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
అవకాడో సాగు చేయడంపై ‘మన్ కీ బాత్’లో ప్రస్తావన
లింగాల, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయన అవకాడో సాగుచేస్తున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. సంవత్సరాల తరబడి టమాటా, అరటి పంటలు సాగు చేసిన ఆయన... ఒకరోజు తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారని తెలిపారు. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా సాగు వివరాలు తెలుసుకుని విజయవంతంగా 4 టన్నుల దిగుబడి సాధించారని కొనియాడారు. స్థానిక మార్కెట్లకు నేరుగా సరఫరా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారని ప్రశంసించారు. మన రైతుల నూతన ఆలోచనలు వ్యవసాయాన్నిలాభసాటిగా మారుస్తున్నాయనడానికి వరదారెడ్డిని ప్రత్యక్ష ఉదాహరణగా మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ, ‘‘గతంలో సాగు చేసిన పంటలతో చాలా నష్టపోవడంతో అవకాడో సాగుకు మొగ్గుచూపాను. ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, దీనికొచ్చే తెగుళ్లు, వాడాల్సిన ఎరువులపై అవగాహన పెంచుకుని, అవకాడో సాగు చేశాను. నాలుగేళ్లకు ఒకటిన్నర టన్ను దిగుబడి వచ్చింది. కిలో రూ.100 చొప్పున చుట్టుపక్కల ప్రాంతాల్లోనే విక్రయించాను. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ నన్ను అభినందించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని గ్రామ ప్రజలతో పంచుకున్నాను.’’ అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అక్కడ చేరకండి.. మా కాలేజీకి రండి!
సర్‌పై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ