Share News

అక్కడ చేరకండి.. మా కాలేజీకి రండి!

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:01 AM

హలో.. మీకు ఫలానా కాలేజీలో సీటు వచ్చింది కదా!. దానికంటే మంచి బ్రాంచ్‌లో సీటు ఇప్పిస్తాం. మేం చెప్పిన కాలేజీలో చేరండి. అన్నీ మేం చూసుకుంటాం. మొదట వచ్చిన సీటు అక్కర్లేదని రిజెక్ట్‌ చేయండి.’ అంటూ కొన్ని కాలేజీలు విద్యార్థులకు ఎర వేస్తున్నాయి.

అక్కడ చేరకండి.. మా కాలేజీకి రండి!
college

  • ఇంజనీరింగ్‌లో కొన్ని సంస్థల వింత ప్రచారం

  • పీఆర్‌వోలు, కన్సల్టెంట్లతో విద్యార్థులకు ఎర..

  • సీటు వచ్చినా చేరకుండా అడ్డుకునే యత్నం

  • లబోదిబోమంటున్న మిగిలిన కళాశాలలు..

  • వివరాలను పోర్టల్‌లో తొలగించాలని వినతి

  • గందరగోళంలో విద్యార్థులు, తల్లిదండ్రులు..

  • ఫిర్యాదులు వచ్చినా స్పందించని అధికారులు

  • అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ‘హలో.. మీకు ఫలానా కాలేజీలో సీటు వచ్చింది కదా!. దానికంటే మంచి బ్రాంచ్‌లో సీటు ఇప్పిస్తాం. మేం చెప్పిన కాలేజీలో చేరండి. అన్నీ మేం చూసుకుంటాం. మొదట వచ్చిన సీటు అక్కర్లేదని రిజెక్ట్‌ చేయండి.’ అంటూ కొన్ని కాలేజీలు విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. మెరుగైన సీటు, కోరుకున్న బ్రాంచ్‌ రాలేదని భావించే విద్యార్థులకు ఫోన్లు చేసి మొదటి కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్లలో చేరకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘కామన్‌ అడ్మిషన్స్‌ పోర్టల్‌’లో విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉంచడంతో దాన్ని ఆసరాగా తీసుకుని అడ్మిషన్లపై ప్రతికూల ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 240 వరకు ఇంజనీరింగ్‌ కోర్సులు అందించే విద్యాసంస్థలు ఉంటే సుమారు 60 విద్యాసంస్థలు ఇలా వేరే కాలేజీల అడ్మిషన్లను లాగేసే ప్రయత్నాలు చేస్తున్నాయని యాజమాన్యాలు భావిస్తున్నాయి. మరోవైపు.. కళాశాలల మధ్య పోటీ విద్యార్థులను గందరగోళంలోకి నెడుతోంది. దీంతో పోర్టల్‌లో మొత్తం విద్యార్థుల వివరాలు తొలగించాలని, ఆయా కాలేజీలకు కేటాయించిన విద్యార్థుల వివరాలను కాలేజీల లాగిన్లలో మాత్రమే పేర్కొనాలని ఏపీ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ను కోరింది.


సీటు వచ్చినా చేరకుండా

ఇంజనీరింగ్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 1,07,829 మందికి ఉన్నత విద్యాశాఖ సీట్లు కేటాయించింది. వారిలో సుమారు 95వేల మంది కాలేజీల్లో చేరారు. నచ్చిన కాలేజీలో సీటు రాలేదని కొందరు, నచ్చిన బ్రాంచ్‌లో రాలేదని మరికొందరు ఆయా కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇలాంటి వారికి సమీప కాలేజీలు ఎర వేస్తున్నాయి. ‘‘మా కాలేజీలో చేరితే మీరు కోరుకున్న బ్రాంచ్‌లో సీటు ఇప్పిస్తాం.’’ అంటు ఫోన్లు చేయిస్తున్నాయి. సాధారణంగా కౌన్సెలింగ్‌కు ముందు ‘మా కాలేజీలో చేరండి.’ అంటూ విద్యాసంస్థలు ప్రచారం చేయడం సహజం. కానీ, సీట్లు కేటాయించిన తర్వాత ఫలానా కాలేజీలో చేరవద్దంటూ కొన్ని కాలేజీలు తమ పీఆర్‌వోలు, కన్సల్టెంట్లతో ఫోన్లు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్దగా ప్రమాణాలు లేని కాలేజీలు సీట్లు భర్తీ కాకపోవడంతో పీఆర్‌వోలపై ఆధారపడుతున్నాయి. సీటు పొందిన విద్యార్థులను సంబంధిత కాలేజీల్లో చేరకుండా నిలువరించి.. మలి విడత కౌన్సెలింగ్‌లో తమ కాలేజీల్లోని ఆప్షన్లు పెట్టిస్తున్నాయి. కొందరు విద్యార్థులు వారి మాటలు నమ్మి మొదటి కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటును రిజెక్ట్‌ చేసి, రెండోవిడత కౌన్సెలింగ్‌లో మంచి సీటు లభించక ఎటూ కాకుండా పోతున్నారు. యాజమాన్యాల సంఘం ఫిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ విద్యార్థుల వివరాలను పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం లేదు.


అడ్మిషన్లపై ఇష్టారాజ్యం

పీఆర్‌వోలపై ఆధారపడి అడ్మిషన్లు పెంచుకుంటున్న కాలేజీలు.. కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన విద్యార్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. కాకినాడలోని రెండు కాలేజీలు.. తాము చెప్పినంత ఫీజులు కట్టకపోతే సీటు ఇచ్చేది లేదని భీష్మించాయి. ప్రభుత్వం కేటాయించిన సీటును కూడా ఇవ్వకుండా విద్యార్థులను ఇరుకున పెడుతున్నాయి. ఓ ఊరి పేరు పెట్టుకున్న ఓ కాలేజీ.. కన్వీనర్‌ కోటా మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థికి అడ్మిషన్‌ తిరస్కరించింది. తమ కాలేజీలో చేరాలంటే హాస్టల్‌లో ఉండాలని, దీనికిగాను రూ.1.2 లక్షలు కట్టాలని, హాస్టల్‌లో ఉండకపోతే సీటు ఇవ్వబోమని తెగేసి చెప్పింది. దీంతో ఆ విద్యార్థి రెండో కౌన్సెలింగ్‌లో రామచంద్రాపురంలోని మరో కాలేజీలో అడ్మిషన్‌ తెచ్చుకోవాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు తిరస్కరిస్తున్నారనీ ఫిర్యాదులు వస్తున్నా విద్యాశాఖ వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా అడ్మిషన్లకు పీఆర్‌వో వ్యవస్థలను అడ్డగోలుగా వినియోగిస్తున్నాయి. ‘మా యూనివర్సిటీలో చేరండి.’ అని చెప్పడమే కాకుండా, పక్క కాలేజీల్లో చేరొద్దంటూ ప్రచారం చేస్తున్నాయని తెలిసింది. అడ్మిషన్లు మెరుగ్గానే ఉన్నప్పటికీ 100 శాతం సీట్లు భర్తీ చేసుకునేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, కొన్ని చిన్న ప్రైవేటు కాలేజీలు.. అండర్‌ గ్యాడ్యుయేట్‌(యూజీ) అడ్మిషన్లను తిరస్కరిస్తూ, పీజీపై ఆధారపడుతున్నాయి. పీజీలో నేరుగా విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఆ కోర్సులపైనే దృష్టి సారిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

దగా డీఎస్సీ అంటే సహించం

NEET PG: ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్షలు

Updated Date - Aug 31 , 2026 | 05:12 AM