Share News

సర్‌పై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:23 AM

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 (సర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిముల, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది.

సర్‌పై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
voter list

  • 44 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ

  • వారిలో 24.54 లక్షల మంది విచారణలు పూర్తి

  • ఇందులో 15 వేలమంది అనర్హులుగా గుర్తింపు

  • సెప్టెంబరు 28కి అభ్యంతరాల పరిష్కారం పూర్తి

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 (సర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిముల, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. జూలై 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. వారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జూలై 31, 2026న ప్రచురించింది. జాబితా ప్రచురణకు ముందు, ప్రచురించిన నాటి నుంచి ఆగస్టు 29 వరకూ కొత్త ఓటర్ల నమోదుకు(పారం-6) 8,58,455 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంకా 2,96,063 దరఖాస్తులను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. అదేవిధంగా ఫారం-7(మరణించిన, బదిలీ అయిన లేదా అనర్హుల పేర్ల తొలగింపునకు సంబంధించి 48,12,704 దరఖాస్తులు రాగా వాటిలో పరిష్కరించాల్సినవి 7,118 దరఖాస్తులు ఉన్నాయి. ఇక, ఫారం-8 దరఖాస్తులు (వివరాల సవరణ, నివాస మార్పు, ఎపిక్‌ రీప్లే్‌సమెంట్‌, దివ్యాంగ ఓటరు నమోదు) మొత్తం 12,03,045 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇంకా పరిష్కరించాల్సిన దరఖాస్తులు 1,86,365గా ఉన్నాయి. అయితే ఆగస్టు 30వ తేదీతో ఎన్నికల సంఘం ప్రకటించిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ముసాయిదా సర్‌ ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబరు 28వ తేదీలోపు ఎన్నికల అధికారులు పరిష్కరించనున్నారు. కాగా, సర్‌లో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వే తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి 44.89 లక్షల ఓటర్లను ఏఎ్‌సడీడీల (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెత్‌, డూప్లికేట్‌) కింద తొలగించారు. దీంతో రాష్ట్ర ఓటర్ల సఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన విషయం తెలిసిందే.


సెప్టెంబర్‌ నెలాఖరుకు తుది జాబితాపై స్పష్టత

సర్‌-2026లో భాగంగా ఓటర్లు సమర్పించిన వారి ఎన్యుమరేషన్‌ పత్రాల వివరాల్లో చిన్న చిన్న తప్పులు, 2002 ఓటరు జాబితాతో వివరాల మ్యాచింగ్‌లో మిస్‌ మ్యాచింగ్‌ తదితర లోపాలున్నాయంటూ 44.28 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. వారిలో 44,16,383 మంది(99.72 శాతం) ఓటర్లకు నోటీసులు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వీరిలో 24,54,407 (55.57శాతం) మంది విచారణ ఆదివారం సాయంత్రానికి పూర్తయింది. వారిలో సరైన పత్రాలు సమర్పించకపోవడంతో 15,358 మందిని అనర్హులుగా తేల్చారు. నోటీసులు ఇచ్చి విచారించిన వారిలో 21,17,162 మందిని తుది ఓటర్ల జాబితాలో కొనసాగించేందుకు అర్హులుగా నిర్ణయించారు. మిగతా ఓటర్లు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగిస్తున్నారు. నోటీసులు అందుకున్న మరో 19,61,976 మంది ఓటర్లను ఇంకా విచారించాల్సి ఉంది. సెప్టెంబర్‌ 28వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే నోటీసులు అందుకున్న 44.28 లక్షల మంది ఓటర్లలో తుది జాబితాలో ఎంత మంది కొనసాగుతారనే విషయంపై స్పష్టత రానుంది.



ఈ వార్తలు కూడా చదవండి

అక్కడ చేరకండి.. మా కాలేజీకి రండి!

దగా డీఎస్సీ అంటే సహించం

Updated Date - Aug 31 , 2026 | 05:25 AM