Share News

జోగి భూకబ్జా

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:59 AM

జగన్‌ జమానాలో మంత్రిగా పనిచేసిన జోగి రమేశ్‌ ‘ఘనకార్యాలు’ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాడు జగన్‌ అండతో చెలరేగిపోయిన ఈ వైసీపీ నేత గుంటూరులో రూ.25-30 కోట్ల విలువైన ఇరిగేషన్‌ భూమిని చెరపట్టారు.

జోగి భూకబ్జా

  • గుంటూరులో 25 కోట్ల ఇరిగేషన్‌ స్థలం స్వాహా!

  • జగన్‌ జమానాలో మంత్రిగా ఉంటూనే రమేశ్‌ దందా

  • ప్రైవేటు వ్యక్తిని ముందు పెట్టి తెర వెనుక కుట్ర

  • నాడు సహకరించిన ఇరిగేషన్‌ అధికారులు

  • కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలు గుర్తింపు

  • ఆధారాలతో సీఎం చంద్రబాబుకు ఎస్‌ఐడీసీ లేఖ

  • విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్‌ జమానాలో మంత్రిగా పనిచేసిన జోగి రమేశ్‌ ‘ఘనకార్యాలు’ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాడు జగన్‌ అండతో చెలరేగిపోయిన ఈ వైసీపీ నేత గుంటూరులో రూ.25-30 కోట్ల విలువైన ఇరిగేషన్‌ భూమిని చెరపట్టారు. ఇటీవల కూటమి ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదులు వచ్చాయి. భూకబ్జాకు నాటి ఇరిగేషన్‌ అధికారులు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆధారాలతో ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లీలాకృష్ణ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. జోగి కబ్జా కథను సీఎంకు సవివరంగా తెలిపారు. ప్రభుత్వానికి అందిన ఆధారాలు, అందులోని విషయ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జోగి భూకబ్జా బాగోతంపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ దందాలో జోగితో అంటకాగిన అధికారుల పాత్రపై కూడా సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.


1990లో కేటాయింపు : ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఐడీసీ) పరిధిలోని గుంటూరు డివిజన్‌ ప్రధాన కార్యాలయం కోసం 1990లో ప్రభుత్వం 1,840.83 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. ఆ తర్వాత 1992లో ఆఫీసు భవనం నిర్మించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఆ స్థలంలోనే ఎస్‌ఐడీసీకి ప్రధాన కార్యాలయం నిర్మించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాతభవనాన్ని కూల్చేసింది. అనంతరం ఆ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యతను ఇరిగేషన్‌ ఈఈ, ఎస్‌ఈలకు అప్పగించారు. భూమి చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ ఏర్పాటు చేసి అందులో ఒక చిన్న షెడ్డు నిర్మించారు. అక్కడ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి వచ్చారు. ఎస్‌ఐడీసీకి ఆఫీసు నిర్మాణ ప్రతిపాదనలను పక్కన పెట్టారు.

జగన్‌ సర్కారు వచ్చాక..

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కొందరు మాయోపాయాలు చేసి ఇరిగేషన్‌ భూమిని కొట్టేసేందుకు ఎత్తుగడలు వేశారు. పందుల పెంపకందార్ల పేరిట భూమి ఆక్రమించేందుకు ఓ కథ అల్లారు. ఖాళీగా ఉన్న ఎస్‌ఐడీసీ స్థలం కాకుండా, పందుల పెంపకందార్లు పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి (వైసీపీ సన్నిహితుడు) భూమిని ఆక్రమించుకున్నారని ప్రభుత్వానికి 2022లో ఫిర్యాదు చేయించారు. భూ ఆక్రమణను వారి జీవనోపాధి కోణంలో చూడాలని, అక్కడ భూమిని కోల్పోయిన ప్రైవేటు వ్యక్తికి పక్కనే ఉన్న ఎస్‌ఐడీసీ స్థలాన్ని ఇప్పించాలని వైసీపీ నేతలు కుట్రకు తెరతీశారు. అంటే, నేరుగా ఎస్‌ఐడీసీ భూమిని కబ్జాచేయడం కుదరదు.. చట్టపరంగా భూ కబ్జాకేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి తెలివిగా ఓ ప్రైవేటు భూమిని తెరమీదకు తీసుకొచ్చి కథ నడిపారు. ఈ ఆలోచనకు అనుగుణంగా నాటి రెవెన్యూ శాఖ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు కోరినట్టు చేస్తే తాను ఇరుక్కుంటానని భావించిన నాటి రె వెన్యూ కార్యదర్శి తెలివిగా వ్యవహరించారు. సగం సగం సహాయం అన్నట్లుగా వ్యవహారం నడిపారు.


పందుల పెంపకందార్ల ఆక్రమణలో ప్రైవేటు భూమి ఉన్నందున, దాని యజమానికి మరో చోట భూమిని ప్రత్యామ్నాయంగా చూపాలని వ్యూహాత్మకంగా లేఖ రాశారు. దీన్ని అడ్డంపెట్టుకొని నేతలు భూచక్రం తిప్పారు. భూమిని కోల్పోయిన ప్రైవేటు వ్యక్తికి ఎక్కడో ఎందుకని, గుంటూరులో ప్రైమ్‌ లొకేషన్‌లోనే ఉన్న ఎస్‌ఐడీసీ ఖాళీస్థలం 1840.83 చ.మీటర్ల భూమిని ఇప్పించాలని మంత్రాంగం నడిపారు. గుంటూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ నుంచి ఏవో కొన్ని ఆదేశాలు పుట్టించారు. ఇక వాటిని చూపి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తికి అప్పగించేశారు. ఇదంతా అనధికారికంగా, ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలతో సంబంధం లేకుండానే జరిగింది. ప్రైవేటు వ్యక్తి వెంటనే ఆ భూమిని తన అధీనంలోకి తీసుకొన్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఆలస్యంగా స్పందించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జలవనరుల శాఖ పెద్దలదాకా వెళ్లింది. ఎస్‌ఐడీసీ స్థలం కబ్జాకు గురైందని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసి, భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం 2023లో ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించింది. కానీ అధికారులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయలేదు. భూమిని కాపాడలేకపోయారు.

జోగి పాత్ర తెరపైకి

సీన్‌ కట్‌ చేస్తే.. 2023లో అక్రమంగా ప్రైవేటు వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయిన తమ విలువైన భూమి మాజీ మంత్రి జోగి రమేశ్‌ నియంత్రణలో ఉందని ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు నిర్ధారణకు వచ్చింది. అసలు ఈ భూమిని ప్రైవేటు వ్యక్తికి అక్రమంగా అప్పజెప్పేందుకు తెరవెనుక ఆక్రమణ నాటకం ఆడించిందే జోగి రమేశ్‌ అని, ఆయనే ఆ కబ్జా వల్ల లబ్ధిపొందుతున్నారని గుర్తించింది. దీనిపై కొన్ని ఆధారాలు సేకరించింది. ఇటీవల కార్పొరేషన్‌ బోర్డులో దీనిపై చర్చకు పెట్టింది. ఎస్‌ఐడీసీ స్థలం కబ్జా వెనక జోగి రమేశ్‌ ఉన్నారని, ప్రస్తుతం ఆ భూమి ఆయన మనిషి నియంత్రణలో ఉందని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోర్డు సమావేశంలో తీర్మానించింది.


ముందస్తు కుట్రతో నాటకం

జోగి భూకబ్జా విషయంలో బోర్డులో తీసుకున్న నిర్ణయం అమలు కోసం ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేగుళ్ల లీలాకృష్ణ ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమ భూమి కబ్జాకు గురైందని, ఇందులో నాడు మంత్రిగా పని చేసిన జోగి రమేశ్‌ పాత్ర, ప్రమేయం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రభుత్వం తలుచుకుంటే అవకాశం ఉన్న చోట ప్రభుత్వ భూమినే పందుల పెంపకందార్ల జీవనోపాధికి కేటాయించగలదు. ఇందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అందుకు భిన్నంగా నాటి వైసీపీ మంత్రి జోగి రమేశ్‌ నేతృత్వంలో ప్రైవేటు భూముల ఆక్రమణ నాటకం ఆడించారు. భూమిని కోల్పోయిన ప్రైవేటు వ్యక్తికి కుట్రపూరితంగా ఎస్‌ఐడీసీ భూమిని ఇప్పించారు. ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగా జోగి రమేశ్‌ ఆడిన నాటకం. ఇందుకు నాటి ఇరిగేషన్‌ అధికారులు వివిధ స్థాయిల్లో సహకరించారు. భూమి రక్షణకు బదులు, మంత్రి ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేశారు. మా భూమిని వెనక్కి ఇప్పించాలి. భూ కబ్జాకు కారణమైన జోగి రమేశ్‌, ఆయనకు సహకరించిన ఇరిగేషన్‌ అధికారులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో కోరారు.

విజిలెన్స్‌ విచారణకు...

ఎస్‌ఐడీసీ చైర్మన్‌ రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఆయన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించాలని అధికారులకు సూచించారు. ఇదే విషయమై సీఎం కార్యదర్శి ఏవీ రాజమౌళి ఈ నెల 21న జలవనరుల శాఖకు లేఖ రాశారు. ‘ఎస్‌ఐడీసీ చైర్మన్‌ రాసిన లేఖలోని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంది.


అందులోని అంశాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఈ నెల 27న లేఖ శారు. ఎస్‌ఐడీసీ భూమి వ్యవహారంలో జరిగిన పరిణామాలు, భూకబ్జా వెనుక కుట్ర, అధికారుల పాత్రపై విచారణ చేపట్టాలని కోరారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 04:59 AM