Share News

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్‌.. రూ.4.07 కోట్ల తక్షణ సాయం

ABN , Publish Date - Aug 29 , 2026 | 08:30 PM

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించేందుకు ప్రభుత్వం రూ.4.07 కోట్ల తక్షణ సాయం ప్రకటించింది.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్‌.. రూ.4.07 కోట్ల తక్షణ సాయం
Veligonda project displaced families

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ నెల 31న జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలను వారి పునరావాస కాలనీలకు స్వచ్ఛందంగా తరలించేందుకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.07 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసిత కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా పశువుల దాణా, నిత్యావసర సరుకులు, మహిళలకు ప్రత్యేక కిట్లను అందించనుంది.

పశువుల దాణాకు రూ.65.8 లక్షలు

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 10 గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాల వద్ద ఉన్న పశువులకు 30 రోజుల పాటు దాణా అందించనున్నారు. మొత్తం 4,933 పశువులకు దాణా అందించేందుకు రూ.65.8 లక్షలు కేటాయించారు. ఇందుకోసం మొత్తం 295.98 మెట్రిక్‌ టన్నుల దాణా అవసరమని అధికారులు అంచనా వేశారు.

10 వేల మందికి నిత్యావసర సరుకుల కిట్లు

నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం రూ.2.81 కోట్లు కేటాయించింది. మొత్తం 10,000 మందికి నిత్యావసర సరుకుల కిట్లను అందించనున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.2,818గా నిర్ణయించారు. ఈ కిట్‌లో 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ వంటనూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఉంటాయి.


మహిళా నిర్వాసితులకు ప్రత్యేక కిట్లు

నిర్వాసితులు కొత్త ఇళ్లలోకి ప్రవేశించే సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా కిట్లను అందించనున్నారు. మొత్తం 6,000 కిట్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.1,000గా ఉంటుంది. ఇందులో చీర, గాజులు, పసుపు, కుంకుమ ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించింది.

సీఎం ఆదేశాలతో చర్యలు

పశువుల దాణా, నిత్యావసర సరుకుల కిట్లు, మహిళలకు ప్రత్యేక కిట్ల కోసం కలిపి ప్రభుత్వం మొత్తం రూ.4.068 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలను వారి పునరావాస కాలనీలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా తరలించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నిర్వాసితులకు పరిహారం కింద ప్రభుత్వం రూ.768 కోట్లు అందించినట్లు అధికారులు తెలిపారు.


Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 29 , 2026 | 08:31 PM