కల్తీ నెయ్యి వివాదం.. జనసేన పార్టీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:37 PM
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది..
అమరావతి, జనవరి 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం(JanaSena assembly meeting) నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. 'నెయ్యి లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసి తిరుమలకు సరఫరా చేశారు. రసాయనాలతో లడ్డూ తయారు చేసి భక్తుల మనోభావాలు, ఆరోగ్యాన్ని దెబ్బ తీసిన వైసీపీ అరాచకాలను ప్రజలకు చెప్పాలి. ఇంత అరాచకం చేసి బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే చర్యలకు వైసీపీ దిగింది' అని శాసనసభా పక్షం పేర్కొంది.
విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలో జనసేన శాసన సభా పక్ష సమావేశం జరిగింది. వచ్చే నెలలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, పార్టీ పాలసీ తదితర అంశాల గురించి చర్చించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా క్షేమమే ధ్యేయంగా చర్చల్లో పాలు పంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. చర్చల సందర్భంలో సభ్యులు సమగ్రంగా అధ్యయనం చేయాలని మనోహర్ కోరారు. తిరుపతి లడ్డూ విషయంలో గత ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారంపై సభలో చర్చించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గురించి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతున్న మంచి గురించి సభలో చర్చిద్దామని జనసేన ఎమ్మెల్యేలు తెలిపారు.
లడ్డూ కల్తీపై సభలో చర్చతో పాటూ మీడియా, సోషల్ మీడియాల్లో లోతుగా చర్చ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలని, తప్పు చేసినవాళ్లే ఎదురు దాడి చేయడాన్ని కట్టడి చేద్దామని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు. శాసన సభా పక్ష సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల గురించి కూడా చర్చ జరిగింది. ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ తరఫున త్రిసభ్య కమిటీ వేసి నిజానిజాలు విచారించాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా పార్టీ ఎంత నిబద్ధతతో ఉంటుందో పవన్ కళ్యాణ్ అందరికీ తెలియజేశారని శాసనసభా పక్షం వెల్లడించింది. అరవ శ్రీధర్ సత్వరమే కమిటీ ముందుకు వచ్చి పూర్వాపరాలు, వివరాలు అందించాలని శాసనసభా పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షులు తీసుకొనే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని జనసేన(JanaSena) శాసన సభా పక్షం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసుండరు.. పాంగి లోయలో మంచు ప్రవాహం..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..