సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 08:27 PM
సిట్ నోటీసులపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ మేరకు గురువారం సిట్ అధికారులకు ఆయన లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు..
హైదరాబాద్, జనవరి 29: సిట్ నోటీసులపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ మేరకు గురువారం సిట్ అధికారులకు ఆయన లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. ఆ లేఖలో కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో బిజీగా ఉన్నాను. నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి రోజు. పలువురు అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాల్సి ఉంది’..
‘మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతా. విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించండి. ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ జరపాలని కోరుతున్నా. భవిష్యత్ నోటీసులు ఎర్రవల్లి నివాసానికే పంపండి. మాజీ ముఖ్యమంత్రిగా.. ఓ పార్టీకి అధినేతగా.. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తా’ అని అన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్‌కు సిట్ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. అంతేకాదు.. కేసీఆర్ వయస్సు 65 ఏళ్ల పైబడి ఉన్నందున.. చట్టపరమైన నిబంధనల (సెక్షన్ 160 సీఆర్పీసీ) ప్రకారం ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలవకుండా, ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మమునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు