నేతన్నలకు గుడ్ న్యూస్.. మగ్గాలకు ఉచిత కరెంట్..
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:51 PM
ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హ్యాండ్లూమ్ మగ్గానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది. అలాగే మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది.
అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త చెప్పింది. చేనేత మగ్గాలకు ఉచిత కరెంట్ సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. హ్యాండ్లూమ్ మగ్గానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది. ఈ పథకం కింద 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది. దీని ద్వారా 10,534 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
చేనేత మగ్గాలకు ఉచిత కరెంట్ అమలుపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చేనేతలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పామని, ఇప్పుడు అమలు చేస్తున్నామని ఆమె అన్నారు.
ఈ పథకం ద్వారా చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆర్థికంగా ఊరట కలుగుతుందని చెప్పారు. మగ్గానికి 200 యూనిట్ల చొప్పున నెలకు దాదాపు రూ.720 చొప్పున.. ఏడాదికి రూ.8,640 ఆదా అవుతుందని వెల్లడించారు. నేతన్నలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్న హామీని కూడా అమలు చేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసుండరు.. పాంగి లోయలో మంచు ప్రవాహం..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..