అన్నీ తెలిసీ అబద్ధాలు!
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:32 AM
పొంతన లేని మాటలు... అర్ధసత్యాలు... అన్నీ తెలిసీ అబద్ధాలు! వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరు ఇదే! బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయన ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు.. ప్రెస్‌మీట్‌లో మళ్లీ జగన్ విన్యాసాలు
కరువుంటే సాగుకు నీరెలా ఇస్తారు?
ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయంటూనే పంటలకు నీరివ్వడం లేదంటారు!
శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేదు
వచ్చిన నీటిని తాగునీటికే ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
జల విద్యుదుత్పత్తికి వినియోగించి తాగు అవసరాలకు నీటి విడుదల
అయినా తోడేస్తున్నారంటూ ఆరోపణ
వెలిగొండ ప్రాజెక్టు తానే కట్టారట!
అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలను అరెస్టు చేస్తే తప్పుడు కేసులట
(అమరావతి-ఆంధ్రజ్యోతి): పొంతన లేని మాటలు... అర్ధసత్యాలు... అన్నీ తెలిసీ అబద్ధాలు! వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరు ఇదే! బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయన ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని ఆయనే వాపోయారు. అదే సమయంలో పంటలకు సాగునీరు ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబును విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 52 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని.. వచ్చే నెల 15వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. ఆ వెంటనే.. ఖరీఫ్ పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు నెలకొంటే పంటలకు సాగునీరు ఎలా ఇస్తారు? ఈసారి తాగునీటికే ప్రాధాన్యం ఇస్తామని, సాగునీరు ఇవ్వడం కష్టసాధ్యమని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో రైతులనూ అప్రమత్తం చేసింది. అయినప్పటికీ... శ్రీశైలం జలాశయంలోని నీటిని రాయలసీమ పంటలకు ఇవ్వకుండా ఏపీ, తెలంగాణ ఎడాపెడా విద్యుదుత్పత్తి కోసం వాడేస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటితోనే జలవిద్యుదుత్పత్తి చేస్తుండటం వాస్తవం. ఇది నీటిని తోడేయడం ఎలా అవుతుందో!
వెలిగొండపై బుకాయింపులు..
వెలిగొండను తానే పూర్తి చేశానంటూ జగన్ ప్రకటించుకున్నారు. ఇటీవల ఆయన సొంత పత్రికలో వెలిగొండ పనులు పూర్తికాలేదంటూ పతాక శీర్షికతో కథనం ప్రచురించారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్‌లో టీబీఎం ఇరుక్కుపోయింది. దానిని తొలగించకుండా, నిర్వాసితులకు రూపాయి పరిహారం చెల్లించకుండా, పనులు పూర్తి చేయకుండా.. 2024 ఎన్నికల ముందు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు జగన్ హడావుడి చేశారు. ప్రజలను ఇంత బహిరంగంగా వంచించడంపై పశ్చాత్తాపం లేకపోగా.. తన క్రెడిట్ చంద్రబాబు చోరీ చేస్తున్నారని అనడం విస్తుగొల్పుతోంది. జగన్ ఐదేళ్ల హయాంలో చేసింది కేవలం 705 మీటర్ల సొరంగం లైనింగ్ పనులే. మొదటి సొరంగం పనులు 2014-19లోనే పూర్తికాగా.. రెండో టన్నెల్‌లో టీబీఎం ఇరుక్కుపోతే జగన్ కనీసం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోర్టు అనుమతితో టీబీఎంను తొలగించి లైన్‌క్లియర్ చేసింది. ఈ రెండేళ్లలో నిర్వాసితులకు ఇప్పటికి రూ.768 కోట్లు చెల్లించగా.. 2-3 రోజుల్లో మిగతా 142 కోట్ల మొత్తం విడుదల చేయనుంది. పనులన్నీ పూర్తిచేసి.. ఈ నెల 31న ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించబోతున్న తరుణంలో తానే ఈ ప్రాజెక్టు పూర్తిచేశానని జగన్ కలరింగ్ ఇవ్వడానికి విఫలయత్నం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
బీసీ కార్డుతో..
కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆందోళన చెందుతున్న జగన్... బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. బీసీలకు తాను కోటా కుదించిన విషయం ప్రస్తావించకుండా.. తన మంత్రివర్గంలో, రాజ్యసభ స్థానాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ బీసీలకు పెద్దపీట వేశానని ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. తన పార్టీకి చెందిన బీసీ నేతలు సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్‌లపై చంద్రబాబు కక్షతో తప్పుడు కేసులు బనాయించారని జగన్ ఆరోపించారు. అయితే అప్పలరాజు కుమారుడు బైక్‌తో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయన చనిపోవడం.. ఆ కేసును తారుమారు చేయడానికి కొడుకు స్నేహితుడు యాక్సిడెంట్ చేసినట్లుగా కథ అల్లడం.. సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించడం వల్లే అప్పలరాజు అరెస్టయ్యారని ప్రజలందరికీ తెలుసు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి జైలుకు పంపింది. దీనిని చంద్రబాబుపై నెట్టేందుకు జగన్ విఫలయత్నం చేశారు. ఆయన హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడుపై తప్పుడు కేసులు పెట్టి.. పోలీసులను అర్ధరాత్రి ఇళ్లకు పంపి అరెస్టు చేయించారు.
ఈ వార్తలను కూడా చదవండి