Share News

సంతోషాలు సమాధి!

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:09 AM

తోడబుట్టిన అన్నయ్యకు రాఖీకట్టేందుకు బయలు దేరిన చెల్లి.. కొత్త ఉద్యోగం లభించిందన్న సంతోషాన్ని భర్తతో పంచుకోవాలనుకున్న ఇల్లాలు.. తమ్ముడి పెళ్లికి హాజరయ్యేందుకు చెంగుచెంగున వస్తున్న అన్నయ్య..

సంతోషాలు సమాధి!

  • అన్నకు రాఖీ కట్టాలని ఆనందంతో బయలుదేరిన సోదరీమణులు

  • కొత్త కొలువు వార్త శ్రీవారితో పంచుకోవాలనుకున్న సతీమణి

  • తమ్ముడి పెళ్లికి వస్తున్న అన్నయ్య

  • కొడుకును చూసుకునేందుకు బయలుదేరిన మాతృమూర్తి

  • కోదాడ ప్రమాదంలో ఆవిరైన ప్రాణాలు

తోడబుట్టిన అన్నయ్యకు రాఖీకట్టేందుకు బయలు దేరిన చెల్లి.. కొత్త ఉద్యోగం లభించిందన్న సంతోషాన్ని భర్తతో పంచుకోవాలనుకున్న ఇల్లాలు.. తమ్ముడి పెళ్లికి హాజరయ్యేందుకు చెంగుచెంగున వస్తున్న అన్నయ్య.. ఇలా వివిధ సంతోషాలను గుండెల్లో నింపుకొని ‘ఫ్రెష్‌ బస్‌’ ఎక్కిన వారంతా ఘోరరోడ్డు ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. - విజయవాడ,(ఆంధ్రజ్యోతి)

సంతోషం పంచుకోలేక పోయారు!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువశామ్యూల్‌, షకీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం విజయవాడకు ఉపాధి కోసం వచ్చారు. సామ్రాట్‌ ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన షకీనా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం జరిగే ఇంటర్వ్యూకు హాజరై కొలువు దక్కించుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు వచ్చి భర్తతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఆమె కలలుకన్నారు. ఫ్రెష్‌బ్‌సలో విజయవాడకు బయలుదేరిన ఆమె కొద్దిగంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాననగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయారు.


చెదిరిన అన్యోన్య దాంపత్యం..

కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన యాసరపు సుధాకర్‌, చిన్ని దంపతులది అన్యోన్న దాంపత్యం. వీరికి ఇద్దరు మగ పిల్లలు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లిన చిన్ని తండ్రి గణేశ్‌కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో తండ్రికి సాయం చేసేందుకు చిన్ని హైదరాబాద్‌ వెళ్లారు. గణేశ్‌ కోలుకుని ఇంటికి చేరుకోవడంతో భార్య చిన్నిని తీసుకొచ్చేందుకు సుధాకర్‌ ఈనెల 23న హైదరాబాద్‌ వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఫ్రెష్‌బస్సులో తేలప్రోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో చిన్ని ప్రాణాలు కోల్పోయింది. సుధాకర్‌ కాలు తొలగించినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటన తెలిసిన చిన్ని అత్త మహాలక్ష్మి కుప్పకూలిపోయారు. అమ్మానాన్న కాసేపట్లో వస్తారంటూ అభంశుభం తెలియని పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకోవటం కంటతడి పెట్టించింది.

అయ్యో.. అమ్మా..!

కృష్ణాజిల్లా కానూరులోని తులసీనగర్‌కు చెందిన బొల్లిపోగు మేరీ జ్యోత్స్న(29) హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వంశీతో వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయస్సున్న ఇవాన్‌ అనే బాబు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ టెక్కీలు కావడంతో బాబు ఆలనాపాలన చూసుకోవడం కష్టమని భావించి కానూరులోని జ్యోత్స్న తల్లిదండ్రుల దగ్గర ఉంచారు. ఆమె ప్రతి వారం బాబును చూసుకోవడానికి కానూరు వస్తుంటారు. బాబు, తల్లిదండ్రులను చూసేందుకు బస్సులో వస్తుండగా జ్యోత్స్నను మృత్యువు కబళించింది. కుమార్తెను పోగొట్టుకుని ఆ తల్లిదండ్రులు రోదనలో మునిగిపోయారు.


తమ్ముడి పెళ్లికి వస్తూ..

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. బుధవారం రాత్రి ఏలూరులో తనకు తమ్ముడి వరసయ్యే చిన్నాన్న కొడుకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి బస్సెక్కి లంకపల్లిలోని ఇంటికి బయల్దేరారు. మరో 5 గంటలు గడిస్తే విజయవాడలో దిగి, అక్కడి నుంచి లంకపల్లికి చేరుకునేవారు. కానీ, రోడ్డు ప్రమాదంలో నాగేంద్రబాబును మృత్యువు కబళించింది. మంగళవారం రాత్రి నుంచి తండ్రి, చిన్నాన్న నాగేంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. ఎంతదూరం వచ్చావు, ఇంకా ఎన్ని గంటలు పడుతుందని అడుగుతూనే ఉన్నారు. ఇంతలో తెల్లవారుజామున నాగేంద్రబాబు ఫోన్‌ నుంచి వారికి కాల్‌ వచ్చింది. బస్సు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. కాగా, కొన్నిరోజుల్లో నాగేంద్రబాబుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.

అన్నకు రాఖీ కట్టాలని

విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో నివాసం ఉండే కృష్ణారావు, సుభాషిణి దంపతులకు రేష్వంత్‌, భావన వర్ష(23) సంతానం. రేష్వంత్‌ సౌదీలో పనిచేస్తున్నారు. భావన వర్ష హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చెల్లెలితో శుక్రవారం రాఖీ కట్టించుకోవడానికి రేష్వంత్‌.. సౌదీ నుంచి విజయవాడకు బయల్దేరారు. అన్నయ్యకు రాఖీ కట్టడానికి భావన హైదరాబాద్‌ నుంచి ప్రయాణమయ్యారు. అన్నకు రాఖీ కట్టిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలని భావించి హెచ్‌ఆర్‌ ఉద్యోగానికి కూడా ఆమె రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి విజయవాడకు ప్రయాణమవ్వాలని నిర్ణయించుకోగా, రాత్రిపూట ప్రయాణం వద్దని స్నేహితులు చెప్పినా.. అన్నయ్య ఇంటికి వచ్చే సమయానికి తాను ఇంట్లో ఉండాలని భావించిన వర్ష.. ఆరాత్రే ఫ్రెష్‌బస్సు ఎక్కారు. బస్సు ఎక్కగానే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. ‘‘ఉదయానికల్లా విజయవాడలో ఉంటా’’ అని చెప్పారు. కానీ, ఆమె రాలేదు. కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. త్వరలో వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడాల్సిన కుమార్తె విగతజీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.


తమ్ముడి కోసం వస్తూ..

ఒక్కగానొక్క తమ్ముడు. గడచిన ఏడాది రాఖీ కట్టలేదు. ఈసారైన తప్పకుండా రాఖీ కట్టాలని బస్సులో బయలుదేరిన ఆమె రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. విజయవాడ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన పిడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్‌లోని అమెజాన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తమ్ముడు, ఇంజనీరింగ్‌ చదువుతున్న చింటుకు రాఖీ కట్టడానికి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఎక్కి విజయవాడకు బయలుదేరారు. తెల్లవారుజామునే విజయవాడకు చేరుకోవాల్సిన లక్ష్మీతేజ రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్‌ చేశారు. ఫోన్‌ ఎత్తిన పోలీసులు.. విషయం చెప్పడంతో ఒక్కసారిగా కన్నీటి సాగరంలో మునిగిపోయారు.

ఈ వార్తలను కూడా చదవండి

వర్షాకాలంలో రోజూ మజ్జిగ తాగుతున్నారా?

‘సౌత్‌ జోన్‌’ మేనేజర్‌ గంగాధర్‌

Updated Date - Aug 27 , 2026 | 04:09 AM