శ్రీశైలంలో తగ్గుతున్న నీరు
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:52 AM
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగువన ఉన్న కాలువలు, ప్రాజెక్టులకు, విద్యుదుత్పాదనకు నీటి వినియోగంతో ఉన్న నిల్వలు కూడా తరిగిపోతున్నాయి
పూర్తిగా నిలిచిపోయిన ఇన్‌ఫ్లో..అనూహ్యంగా పెరిగిన గోదావరి
పోలవరం స్పిల్‌వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల విడుదల
సముద్రంలోకి 4.63 లక్షల క్యూసెక్కులు
శ్రీశైలం/పోలవరం/వేలేరుపాడు/కుక్కునూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగువన ఉన్న కాలువలు, ప్రాజెక్టులకు, విద్యుదుత్పాదనకు నీటి వినియోగంతో ఉన్న నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. ఇటు గోదావరి నదిలో వరద అనూహ్యంగా పెరిగింది. సముద్రంలోకి 5లక్షలకుపైగా క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రంలో ఏపీ ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. తెలంగాణ ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగించి 35,315 క్యూసెక్కులను వినియోగించి దిగువకు నీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 141 క్యూసెక్కుల నీరు విడుదలై మొత్తంగా 48,906 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైంది. జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 162.05 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 14,359 క్యూసెక్కులు విడుదల కాగా.. 15,219 క్యూసెక్కుల నీరు సాయంత్రానికి శ్రీశైలం వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తిగా నిండినప్పటికీ ఎగువ నుంచి వరద తగ్గడంతో దిగువకు వదిలే ప్రవాహం కూడా బాగా తగ్గిపోయింది. జూరాలకు 15,490 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నాగార్జునసాగర్‌కు 20,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతలకు ఎలాంటి ప్రవాహమూ లేదు.
పోలవరంలోకి 5.10 లక్షల క్యూసెక్కుల వరద
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, సీలేరు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద 5,83,563 క్యూసెక్కులు ప్రవహిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టులోకి 5,10,872 క్యూసెక్కుల వరద వస్తోంది. దీనిని స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసినట్లు డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు.