ఎల్‌నినోపై నాలుగంచెల ప్రణాళిక
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:40 AM
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వానలోటుతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటికే వేసిన పంటలు ప్రమాదంలో ఉన్నాయి
ప్రతి భూమీ పరిశీలన.. ప్రతి రైతుకూ అవగాహన
ప్రణాళికాబద్ధంగా కాల్వలకు నీటి విడుదల
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
ప్రతి భూమీ పరిశీలన.. ప్రతి రైతుకూ అవగాహన
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
పంటల బీమా రెట్టింపు... విస్తృత ప్రచారం
(అమరావతి- ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వానలోటుతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటికే వేసిన పంటలు ప్రమాదంలో ఉన్నాయి. నైరుతి రుతు పవన (జూన్ 1 నుంచి ఆగస్టు 25 వరకు) కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువగా ఉండగా, ఆగస్టు 25 నాటికి రాష్ట్రంలో 51శాతం వాన లోటు నమోదైంది. ఇది దేశవ్యాప్త లోటుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ వర్షపాత లోటు ఉంది. 25 జిల్లాలు లోటు, 3 జిల్లాలు తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టింది.
రిస్క్‌లో 3,434 రైతు సేవా కేంద్రాల పరిధి
వ్యవసాయ శాఖ ఐఎండీ, క్రీడాతో సంప్రదించి ఫిబ్రవరి నుంచే ఎల్‌నినో పరిస్థితులను పర్యవేక్షించడం ప్రారంభించింది. మార్చిలో ఎల్‌నినో ప్రభావం 30-62శాతంగా ఉన్నప్పుడే తొలి అంచనాను ప్రభుత్వానికి ఇచ్చింది. వాతావరణ అంచనాలు, గత సారూప్య సంవత్సరాల సమీక్ష ఆధారంగా మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎ్‌సకే) పరిధిని డైనమిక్‌గా రిస్క్ గ్రేడింగ్ చేశారు. ప్రస్తుతం 1,357 ఆర్‌ఎ్‌సకేల్లో అధిక తీవ్రతగా, 2,077 చోట్ల మధ్యస్థ తీవ్రతగా గుర్తించారు. మొత్తం 3,434 ఆర్‌ఎ్‌సకేలు ప్రభావిత ప్రాంతాలుగా నిర్ధారించారు. దీంతో ప్రతి ప్రాంతంలో నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళికను అధికారులు రూపొందించారు. దీనిలో భాగంగా గోదావరి డెల్టా నీటి విడుదలను ముందుకు జరిపి, జూన్1కి తీసుకొచ్చారు. నెల్లూరు-తిరుపతి (సోమశిల-కండలేరు) ఆయకట్టులో ఎడగారు వరిని లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ముందుగానే వేశారు. ఈ వరి ప్రస్తుతం కోత దశలో ఉంది. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సాగు తగ్గుదల కాకుండా, వరి విస్తీర్ణం తగ్గించడం మాత్రమే చేస్తున్నారు.
తగ్గిన వరి.. పెరిగిన పప్పుధాన్యాల సాగు
ఖరీ్‌ఫలో ఇప్పటివరకు విత్తనం పడింది 20.35లక్షల హెక్టార్లు. గతేడాది 25.63లక్షల హెక్టార్లతో పోల్చితే సుమారు 21శాతం తగ్గింది. ప్రధాన మార్పు వరి విస్తీర్ణంలో ఉంది. వరి సాగు విస్తీర్ణం 11.79 లక్షల నుంచి 10.37లక్షల హెక్టార్లకు తగ్గింది. అయితే పప్పు ధాన్యాల విస్తీర్ణం 2.16లక్షల నుంచి 2.66లక్షల హెక్టార్లకు పెరిగింది. విత్తిన విస్తీర్ణంలో మార్పు నీటి లభ్యతకు అనుగుణంగా జరిగింది. వరి నుంచి ఇతర పంటలకు మళ్లించాలనే 1.29లక్షల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటివరకు 36వేల హెక్టార్లు(28ు) సాధించారు.
నాలుగంచెల ప్రణాళిక
ఒకే విధానాన్ని అన్ని ప్రాంతాలకు వర్తింపజేయకుండా, భౌతిక పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా.. అవసరానికి, ప్రాంతానికి అనుగుణమైన వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది నాలుగు ప్రధాన అంచెల ప్రణాళిక ప్రక్రియలపై ఆధారపడి ఉంది.
నీరు అందుబాటులో ఉన్నచోట సమర్ధవంతంగా వినియోగించడం, ముందస్తు విత్తనం, రిజర్వాయర్ల విడుదల ప్రణాళిక, పంట ఎంపికకు అనుగుణంగా నీటి పారుదలను సమన్వయం చేయడం. నీరు పరిమితంగా ఉన్నచోట.. తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, ప్రకృతి వ్యవసాయం, స్థానిక కరువు నిరోధక పరిస్థితులను ప్రోత్సహించడం.
అనుబంధ రంగాల పరిరక్షణ.. గ్రామీణ జీవనోపాధికి కీలకమైన ఉద్యానవనాలు, పశుసంవర్ధకం, మత్స్య, పట్టు పరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం.
పంటల బీమాను బలోపేతం చేయడం, బీమా చేయించడం ద్వారా రైతులకు భరోసా ఇవ్వడం.
ఈ వ్యూహాన్ని రైతు వారీగా, పొలం వారీగా అమలు చేసేలా ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని 8,489 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రభుత్వ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఇవన్నీ దోహదం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని తెలిపారు.
రైతుకు దీమాగా పంటల బీమా
ఎల్‌నినో నేపథ్యంలో పంటల బీమా కవరేజ్ రెండింతలకుపైగా పెరిగింది. ఖరీఫ్ 2025లో 7.83లక్షల హెక్టార్ల నుంచి ప్రస్తుత ఖరీ్‌ఫలో 16.39లక్షల హెక్టార్లకు పెరిగింది. విస్తీర్ణపరంగా పంటల బీమా నమోదులో ఏపీ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. రైతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వాతావరణ ఆధారిత (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పంటల బీమా నమోదు గడువును జూలై31వరకు, దిగుబడి ఆధారిత పంటల బీమా(పీఎంఎ్‌ఫబీవై) గడువును ఆగస్టు 31 వరకు పెంచారు. దీనివల్ల ఉద్యాన పంటల బీమా కవరేజ్ గణనీయంగా పెరిగి, మరిన్ని పంటలకు బీమా వర్తించింది. ఎల్‌నినో సమయంలో పంట నష్టాల నుంచి రైతులకు ఽఆర్థిక రక్షణగా నిలుస్తోంది పంటల బీమా!
రైతన్నా.. మీకోసం కార్యక్రమంతో క్షేత్రస్థాయికి
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రతి రైతును పలకరించేలా, ప్రతి వ్యవసాయ కమతాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమం సాగుతోంది. రైతుసేవా కేంద్రాల కార్యాచరణ కమిటీలు వ్యవసాయ కమతాలను సందర్శించి, ఈ-క్రాప్ వ్యవస్థలో విత్తనం, పంట స్థితి, నీటిపారుదల విధానాన్ని నమోదు చేస్తున్నాయి. పంట దశకు అనుగుణమైన సలహాలు ఇస్తున్నాయి. మొదటి వారం పంట నిర్ధారించి, అక్కడిక్కడే సలహాలివ్వడం, తర్వాత ఎనిమిది వారాలు పంటల స్థితిని పర్యవేక్షించనున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల 87,686 ఎకరాల్లోని పంటలు తేమ ఒత్తిడిని, 15,250 ఎకరాల్లో పంటలు వాడిపోవడం, 3,731 ఎకరాల్లో పంటలు ఎండిపోవడాన్ని గుర్తించారు. అత్యధిక ప్రభావిత విస్తీర్ణంలో కర్నూలు (83,036ఎకరాలు), నంద్యాల(20,624ఎకరాలు) జిల్లాలు నమోదయ్యాయి.
డిజిటల్ సాంకేతికత వినియోగం
ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మానటరింగ్ సిస్టమ్(ఏపీఏఐఎంఎస్) 2.0 యాప్ ద్వారా ప్రతి కమతం విత్తన స్థితి నుంచి పంట పరిస్థితి, నిర్ధారణ, జోక్యం, ఫొటో ఆధారాలు, తుది ఫలితం వరకు ట్రాక్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో పంట ఆరోగ్యం, క్షేత్రస్థాయి పరిస్థితులపై రైతులకు కోటీ 89లక్షల సంక్షిప్త సందేశాలు పంపారు.
ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, రోజూవారీ సమీక్ష కోసం సీనియర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు డ్యాష్‌బోర్డు సమీక్షలు నిర్వహించి, ఇన్‌పుట్, కార్యాచరణ సమస్యలను పరిష్కరిస్తున్నారు. రైతులు ఫార్మర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, రియల్ టైమ్‌లో పంట-ప్రత్యేక సలహాలు, వాతావరణ హెచ్చరికలను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు రైతుసేవా కేంద్రం బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి.
కరవు నివారణ చర్యలు
ఎల్‌నినోను దృష్టిలో పెట్టుకుని, ఈ సీజన్‌లో వర్షాధార ఉల్లి సాగును నిరోధించారు. మిరప విస్తీర్ణ లక్ష్యాన్ని రెండు నుంచి లక్ష హెక్టార్లకు పరిమితం చేశారు. రిస్క్ మ్యాపింగ్ ప్రకారం రాయలసీమలోని కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉద్యాన తోటలు ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. పంటల వారీ ప్రత్యామ్నాయ వ్యూహాలు, నోటిఫైడ్ ఉద్యాన పంటలకు పంటల బీమా అమలు చేస్తున్నారు. గ్రామాల వారీగా నీటి తొట్టెలను పర్యవేక్షిస్తున్నారు.
ఎల్‌నినో అంటే..?
పసిఫిక్ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, వర్షపాతంపై ప్రభావం చూపే వాతావరణ నమూనాయే ఎల్‌నినో. దీనివల్ల రుతుపవనాలు బలహీనంగా, ఆలస్యంగా, అసమానంగా ఉండొచ్చు. వర్షాధార పంటలపై ఇది ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఏడాదికొకవిధంగా మారుతుంది.
ఈ వార్తలను కూడా చదవండి