అడిగిన చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:40 AM
మహిళలు అడిగిన చోట బస్సు ఆపడం లేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై ఓ కుటుంబం దాడికి పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాలలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా, అక్టోబర్ 4: మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ గుంటూరు నుంచి మాచర్లకు వెళ్తున్న సమయంలో.. ఓ కుటుంబం గురజాల సమీపంలో కాపుకాచి డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు నుంచి మాచర్లకు వెళ్లే ఆర్టీసీ బస్సు గురజాల మీదుగా వెళ్తుంది. అయితే.. ఎక్స్‌ప్రెస్ కావడంతో డ్రైవర్ ఎక్కడపడితే అక్కడ ఆపకుండా బస్‌స్టాప్ వద్దనే ఆపేవారు. ఈ నేపథ్యంలో గురజాల వద్ద అడిగిన చోట డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు తీసుకెళ్లి బస్సు ఆపుతున్నాడంటూ.. కొందరు మహిళలు తమ కుటుంబసభ్యులకు చెప్పుకున్నారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు దారికి అడ్డంగా బైక్స్ పెట్టి బస్సును ఆపారు. దీంతో బైక్స్‌ను తీయాలంటూ కండక్టర్ బస్సు దిగడంతో.. కండక్టర్‌పై కర్రలతో, కోడిగుడ్లతో దాడి చేశారు. గమనించిన డ్రైవర్ అడ్డుకోవడానికి బస్సు దిగగా.. ఆయనపై కూడా దాడికి పాల్పడ్డారు. దాడిని అడ్డుకోబోయిన ప్రయాణికులపై కూడా కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఈ మేరకు బస్సు డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు ఆధారంగా గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం
అమ్మి సొమ్ము చేసుకునేందుకే చోరీ