వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం: టీడీపీ ఎంపీ
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:31 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.
అమరావతి, జులై 10: దేశద్రోహానికి పాల్పడిన రావణ్‌కు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశద్రోహ శక్తుల తరఫున వాదనలు వినిపించడంపై ప్రజలకు జవాబు చెప్పాలని వైసీపీ నేత సుధాకర్ రెడ్డికి స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడే వారిని వైసీపీ సమర్థించడం సభ్యసమాజం తలదించుకునే చర్యగా ఆయన అభివర్ణించారు. కులాల, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సోషల్ మీడియా యాక్టివిస్టులకు నెలనెలా ముడుపులిచ్చి, ప్రజాప్రభుత్వంపై బురదజల్లేలా సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తున్నారంటూ వైసీపీ నేతలను విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ 'యజ్ఞాన్ని' భగ్నం చేసేందుకు వారు రాక్షసుల్లా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని విధ్వంసానికి ప్లాన్ గీసి, తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా గారే ప్రశంసించారని ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ గుర్తు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమతో పోలీసు అధికారులను ఫోన్లలో బెదిరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైసీపీ నేతల తీరును ఎండగట్టారు.
ప్రజలు 11 సీట్లు ఇచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించకుండా, కేవలం విధ్వంసం సృష్టించడమే ధ్యేయంగా పెట్టుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, జగన్‌కు గవర్నర్ బంగ్లా కావాలంటూ అధికార దాహం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తారని చెప్పారు. వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పరధ్యానంలో రైలు పట్టాలపై.. రెప్పపాటు కాలంలో రక్షించాడిలా..
ఏనుగు పాదమే మెట్టైంది.. చిన్నారి సాహసం వీడియో వైరల్
For More AP News And Telugu News